బ‌న్నీ ఇందులో కూడా ఇద్ద‌రిగానా?

అల్లు అర్జున్ ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌నే మాట కొత్త కాదు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కుడిగా… దిల్‌రాజు నిర్మించ‌బోతున్న `ఐకాన్‌` చిత్రంలో అల్లు అర్జున్ డు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నార‌ని ఎప్ప‌టినుంచో ప్ర‌చారం సాగుతోంది. అయితే ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. ప్ర‌స్తుతం వేణు శ్రీరామ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా `పింక్` రీమేక్ రూపొందిస్తున్నారు. ఆ చిత్రం త‌ర్వాతే ఐకాన్ మొద‌ల‌వుతుంది.

అల్లు అర్జున్ కూడా ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. అయితే `ఐకాన్` విష‌యంలో వినిపించిన ద్విపాత్రాభిన‌యం మాట, తాజాగా సుకుమార్ చిత్రం విష‌యంలోనూ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం చేస్తున్న సుకుమార్ సినిమాలో కూడా రెండు పాత్రలు చేయ‌బోతున్నార‌ని, ప్రేక్ష‌కుల‌కు ఒక పాత్ర‌లో స‌ర్‌ప్రైజ్‌ని ఇవ్వ‌బోతున్నాడ‌ని తెలిసింది. అది ర‌హ‌స్యంగా ఉంచార‌ని, సినిమాలో కూడా ఎవ్వ‌రూ ఊహించ‌ని స‌మ‌యంలో మ‌రొక పాత్ర రివీల్ అవుతుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి అందులో నిజమెంత‌న్న‌ది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. శేషాచ‌లం అడ‌వుల నేప‌థ్యంలో, ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్ ఆధారంగా సాగే క‌థ ఇది. ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది.