ఠాగూర్ సీక్వెల్లో న‌టిస్తున్నారా?

Chiranjeevi and Koratala Siva - File Photo

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 152వ చిత్రం క‌థాంశంపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే వీటిలో స‌రైన‌ క్లారిటీ లేదు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న‌ క‌థ‌నాల్ని బ‌ట్టి ఇదీ క‌థ అంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఎలాంటి క‌థ‌ను ఎంచుకున్నారు అన్న‌ది పూర్తిగా తెలుసుకోవ‌డం సాధ్య‌ప‌డ‌లేదు. మిర్చితో క‌మ‌ర్శియ‌ల్ డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇచ్చిన శివ ఆ త‌ర్వాత త‌న స్టైలే  వేర‌ని ప్రూవ్ చేసారు. గ‌త రెండు మూడు చిత్రాలు ఎంతో సెన్సిటివ్ పాయింట్ ని ఎంచుకుని విజ‌యాలు అందుకున్నారు.  శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను చిత్రాల‌తో ఊహించ‌ని ట్విస్ట్ లు ఇచ్చాడు. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ తో చేసే క‌థ‌లో ఆ ఛాయ‌లుంటాయ‌ని ఊహాగానాలొస్తున్నాయి.  ఇప్ప‌టికే 152వ సినిమా స్టోరీపై బోల‌డెన్ని రూమ‌ర్లు వ‌చ్చాయి. పొలిటిక్ థ్రిల్ల‌ర్ అని, న‌క్స‌లిజం బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీ అని, ఠాగూరు క‌థ‌కు ద‌గ్గ‌రంగా ఉంటుంద‌ని ఇలా కొన్ని రూమ‌ర్లు వైర‌ల్ అవుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో  మెగాస్టార్ రోల్ ఇదేనంటూ తాజాగా  సోష‌ల్ మీడియాలో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో చిరంజీవి ఎండోమెంట్ (దేవాల‌యాల శాఖ‌) డిపార్ట్ మెంట్ లో ప‌నిచేసే ప‌వ‌ర్‌ఫుల్  అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని, ఆ శాఖ‌లో జ‌రిగే అవినీతి పై చిరు స‌మ‌ర‌శంఖం పూరించ‌నున్నార‌ని వినిపిస్తోంది. ఇటీవ‌లే `గోవింద హ‌రి గోవింద` అనే టైటిల్ ప్రచారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో చిరు రోల్ క‌చ్చితంగా అదే అయ్యి ఉంటుంద‌ని అంటున్నారు. 2003 బ్లాక్ బ‌స్ట‌ర్ ఠాగుర్ లో అవినీతిపై పోరాడే ఓ సామాన్య పౌరుడి పాత్ర‌లో చిరు న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా చిరు ఇమేజ్ ను ప‌దింత‌లు చేసింది. ఠాగూర్ నింపిన‌ స్ఫూర్తితోనే ఆయ‌న‌ రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని అభిమానులు చెబుతారు.

మ‌రి 152వ సినిమా క‌థాంశంపై తాజా రూమ‌ర్ల నేప‌థ్యంలో చిరు నిజంగా అలాంటి ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్టులో క‌నిపిస్తే ఎలా ఉంటుందోన‌న్న ఆస‌క్తి ఫ్యాన్స్  ని నిల‌వ‌నీయ‌డం లేదు. కొర‌టాల లాంటి ప‌ర్ఫెక్ష‌న్ ఉన్న‌ డైరెక్ట‌ర్  చిరుని  ఏ స్థాయిలో చూపిస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు అంటూ చ‌ర్చ సాగుతోంది. త‌న‌దైన శైలి సున్నిత ఉద్వేగాల్ని మిస్ కాకుండానే చిరును అత‌డు నెక్స్ట్ లెవ‌ల్లో ఆవిష్క‌రిస్తాడ‌ని భావిస్తున్నారు.  ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష క‌థానాయికగా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అజ‌య్ -అతుల్ ద్వ‌యం  సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సంగీతం అందించిన కాంబో అది. మ‌రాఠా బ్లాక్ బ‌స్ట‌ర్ సైరాట్ కి ఈ ద్వ‌య‌మే  సంగీతం అందించారు. మెగాస్టార్ 152తో ఆ ఇద్ద‌రి పేర్లు ద‌క్షిణాదినా మార్మోగ‌డం ఖాయం.