మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య ఏం లాలూచీ నడుస్తోంది? తమ్ముడికి అన్నయ్య ఎలాంటి సలహా ఇచ్చారు? పవన్ రాజకీయాల్లో ఉన్నా సినిమాల్లోకి రావాల్సిందేనని చిరు పట్టుబడుతున్నారా? అందుకు పవన్ కూడా సై అనేశారా? .. ప్రస్తుతం జనసైనికులు సహా తెలుగు ఆడియెన్ లో సందేహమిది. తాజాగా సైరా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ కామెంట్ పవన్ తిరిగి సినిమాల్లోకి రాబోతున్నారన్న సంకేతాలు ఇచ్చింది. దాంతో మరోసారి దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాజా ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నా బిడ్డ రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు ఎంత ఆసక్తిగా ఉంటానో పవన్ కల్యాణ్‌తోనూ సినిమా చేసేందుకు అంతే ఆసక్తిగా ఉంటాను. నేను-పవన్ కలిసి నటిస్తామంటే రామ్ చరణ్ సిద్ధంగానే ఉన్నాడు.. అంటూ చిరు వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన మాటల్ని బట్టి పవన్ తిరిగి సినిమాలు చేయాలన్న ఆకాంక్ష ఆ మాటల్లో ధ్వనించింది. దీంతో పవర్ స్టార్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ఇప్పటికే జనసేనను నాశనం చేయాలని చూసే ప్రత్యర్థులు ఇప్పటికే ఆ పార్టీ పైనా అధినాయకుడైన పవన్ పైనా బోలెడంత దుష్ప్రచారం సాగించారు. జనసేనపైనా.. పవన్ కల్యాణ్ పైనా అపరిమితంగా సోషల్ మీడియాల్లో కథనాలు వండి వార్చారు. అందువల్ల పవన్ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రచారానికి వెరవక తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని 2024 ఎన్నికలే తన ప్రధాన లక్ష్యం అని పవన్ పదే పదే చెప్పకనే చెబుతున్నారు. సినిమాల వైపు రావాలన్న నిర్ణయాన్ని పవన్ ఎప్పుడూ ఏ వేదికపైనా ప్రకటించిందేం లేదు.
2024 ఎలక్షన్స్ లోపు పవన్ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని.. సీరియస్ గా రాజకీయాలకే స్టిక్ అవ్వాలని జనసేన సైనికులు కోరుకుంటున్నారు. తాజాగా పవన్ కి చిరు సలహా ఇచ్చారు అన్నది ఎంత వరకూ నిజం? అసలు పవన్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నది ఇప్పటికి కేవలం రూమర్ మాత్రమే. జనసేనాని మైండ్ లో ఏం ఉందో అభిమానులు కూడా ఊహించలేనిది. అతడు బలంగా దేనిని నమ్మితే అదే చేస్తూ ముందుకెళుతుంటారనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషిస్తున్నారు.