సీన‌య్య‌`కి కూడా బాలీవుడ్ నుంచేనా?!

అగ్ర ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ హీరో అయిపోయారు. ఆయ‌న న‌ర‌సింహారావు ద‌ర్శ‌క‌త్వంలో `సీన‌య్య‌` అనే సినిమా చేస్తున్నాడు. దిల్‌రాజు నిర్మాత‌. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా గురించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ న‌టించ‌బోతోంద‌ట‌. అదెవ‌ర‌న్న‌ది ఇంకా బ‌య‌టికి రాలేదు కానీ.. చిత్ర‌బృందం మాత్రం విద్యాబాల‌న్ మొద‌లుకొని ప‌లువురు సీనియ‌ర్ క‌థానాయిక‌ల్ని సంప్ర‌దించార‌ట‌. మ‌రి ఎవరు ఓకే అయ్యారో తెలియ‌దు కానీ… క‌థానాయిక మాత్రం ముంబై నుంచే వ‌స్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో ముంబై భామ‌ల‌దే హ‌వా. అక్క‌డ్నుంచే క‌థానాయిక‌ల్ని పిలిపించేవాళ్లం. క్ర‌మంగా ద‌క్షిణాదిలోనూ హీరోయిన్ల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మ‌ల‌బారు తీరం నుంచి అంద‌గ‌త్తెలు పెద్దయెత్తున రావ‌డం మొద‌లైంది. అదే స‌మ‌యంలో బాలీవుడ్ భామ‌ల పారితోషికాలు ఆకాశాన్ని తాక‌డం, వాళ్ల హోట‌ల్ గ‌దులు, ప్ర‌యాణాలు క‌లిసి నిర్మాత‌ల‌కి పెనుభారం అయ్యే పరిస్థితులు త‌లెత్త‌డంతో ముంబైవైపు వెళ్ల‌డం మానేశారంతా. ఈమ‌ధ్య మ‌ళ్లీ బాలీవుడ్ నుంచి క‌థానాయికల రాక మొద‌లైంది. చిన్న సినిమాల‌కి కూడా బాలీవుడ్ భామ‌ల్నే సంప్ర‌దిస్తున్నారు. కొత్త‌ద‌నం కోస‌మే ఆ ప్ర‌య‌త్నం. మ‌రి `సీన‌య్య‌` స‌ర‌స‌న ఆడిపాడే అవ‌కాశం ఎవరికొస్తుందో చూడాలి.