`సైరా` డైరెక్ట‌ర్ మ‌రో పాన్ ఇండియా?

Ram Charan's Surprise Gift for Surender Reddy

`సైరా` డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి మ‌రో పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడా? అంటే అవుననే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఆయ‌న క‌న్ను అగ్ర హీరోల‌పైనే ఉంద‌ని తెలుస్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ల‌కు క‌థ‌లు రాశాడంటూ ప్ర‌చారం సాగుతోంది. మెగా ప‌వ‌ర్ స్టార్, మెగాస్టార్ నే డైరెక్ట్ చేసి మెగా డైరెక్ట‌ర్ గా వెలిగిపోతున్న సూరి ఖాతాలో రోజుకో పెద్ద స్టార్ పేరు తెర‌పైకొస్తోంది. ఏది నిజం. ఏది అబ‌ద్ధం? అన్న‌ది అంతు చిక్క‌డం లేదు. `సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి భారీ చిత్రం త‌రవాత ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి రేంజ్ పెరిగింది. అత‌ను సినిమాను హాండిల్ చేసిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. ఒక పాన్ ఇండియ‌న్ చిత్రాన్ని వెండితెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించ‌గ‌ట‌డ‌ని ఈ సినిమాతో సురేంద‌ర్‌రెడ్డి నిరూపించుకున్నాడు. రాజ‌మౌళి త‌ర్వాత మ‌రో పాన్ ఇండియా రేంజ్ డైరెక్ట‌ర్ తెలుగు సినిమాకి ల‌భించాడ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

దీంతో అత‌ని త‌దుప‌రి చిత్రం ఏలా ఉంటుంది? అని అంద‌రిలోనూ ఆస‌క్తి మొద‌లైంది. ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌భాస్‌కు సురేంద‌ర్‌రెడ్డి ఓ భారీ స్పాన్ వున్న క‌థ‌ని సిద్ధం చేశాడ‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు చెప్ప‌బోతున్నాడ‌ని తాజాగా వినిపిస్తోంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం `జిల్‌` ఫేమ్ రాధా కృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `జాన్‌` చిత్రంలో న‌టిస్తున్నాడు. పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇది పూర్త‌యితే గానీ ప్ర‌భాస్ డేట్స్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఈ సినిమా పూర్త‌వ్వాలి. సురేంద‌ర్‌రెడ్డి సినిమా తెర‌పైకి రావాలంటే మ‌రో ఏడెనిమిది నెల‌లైనా వేచి చూడాల్సిన ప‌రిస్థితి. ప్ర‌భాస్ కు స్క్రిప్ట్ న‌చ్చాలి. ఇవ‌న్నీ జ‌రిగితే గానీ సురేంద‌ర్‌రెడ్డి సినిమా ప‌ట్టాలెక్క‌దు. ఇక మ‌హేష్ ఇప్ప‌టికే స‌రిలేరు నీకెవ్వ‌రు ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడికి కాల్షీట్లు ఇచ్చేశార‌న్న ప్ర‌చారం ఉంది కాబ‌ట్టి మ‌రి సురేంద‌ర్ రెడ్డికి ఎంత‌వ‌ర‌కూ ఛాన్స్ ఉంది అన్న‌ది చూడాలి.