అర్జున్ సుర‌వ‌రం రిలీజ్‌కు అదే స‌మ‌స్య‌?

యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన అర్జున్ సుర‌వ‌రం ఇంత వ‌ర‌కూ రిలీజ్ కు నోచుకోలేదు. గ‌తేడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నోసార్లు రిలీజ్ తేదీలు ప్ర‌క‌టించి వాయిదా వేసారు. దీనికి అస‌లు కార‌ణం ఏంటి? అస‌లు అర్జున్ సుర‌వ‌రం స‌మ‌స్య ఏంటి? అని ఆరా తీయ‌గా ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా బిజినెస్ అవ్వ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని వినిపిస్తోంది. కొంత వ‌ర‌కూ బిజినెస్ జ‌రిగినా నిర్మాత‌లు సంతృప్తిగా లేర‌నేది ఓ టాక్.  బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్.ఎల్.పి- ఆరా సినిమాస్ సంస్థ‌లు ఈ సినిమాని నిర్మించాయి. పంపిణీ రంగం స‌హా సినీనిర్మాణంలో అంతో ఇంతో అనుభ‌వం ఉన్న సంస్థ‌లే ఇవి. ప్ర‌స్తుతానికి ఈ సినిమాకి సంబంధించి లాభ‌న‌ష్టాల్ని బేరీజు వేసుకుని రిలీజ్ ఆపారా అంటూ సందిగ్ధ‌త వ్య‌క్త‌మ‌వుతోంది. నిఖిల్ మార్కెట్ డౌన్ అయిన నేప‌థ్యంలో రిట‌ర్నులు తేగ‌ల‌డా? అన్న సందేహం తో స‌ద‌రు సంస్థ రిలీజ్ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి ఈ సినిమా కు ఆదిలోనే హంస పాదు ప‌డింది. ముందుగా ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్ ఖ‌రారు చేసారు. కానీ దానిపై మ‌రో నిర్మాత న‌ట్టి కుమార్ ఆ టైటిల్ త‌న సినిమాది అంటూ మీడియాకెక్క‌డంతో పెద్ద ర‌చ్చ జ‌రిగింది. దీంతో యూనిట్ ముద్ర టైటిల్ ను అర్జున్ సుర‌వ‌రంగా మార్చింది.