శంక‌ర్ ఇప్ప‌ట్లో కోలుకోవ‌డం క‌ష్ట‌మేనా?

ఇండియ‌న్ 2 సెట్లో జ‌రిగిన ప్ర‌మాదం యావ‌త్ భార‌తీయ చిత్ర పరిశ్ర‌మ‌ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, మ‌రికొద్దిమంది చావు బ‌తుకుల్లో కొట్టు మిట్టాడుతున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన‌వాళ్ల‌లో ద‌ర్శ‌కుడు శంక‌ర్ కూడా ఉన్నార‌ట‌. ఆయ‌న కాళ్ల‌కి బ‌ల‌మైన గాయాలు అయ్యాయ‌ట‌. ఆయ‌న ఇప్ప‌ట్లో కోలుకోలేని విధంగా దెబ్బ‌లు త‌గిలాయ‌ని అంటున్నారు. కానీ వాస్త‌వ ప‌రిస్థితేమిట‌న్న‌ది మాత్రం ఇంకా బ‌య‌టికి రావ‌డం లేదు.

ప్ర‌మాదం స‌మ‌యంలో క‌మ‌ల్‌హాస‌న్‌, కాజ‌ల్ త‌దిత‌రులు సెట్లోనే ఉన్నార‌ట‌. వాళ్లు వెంట్రుక‌వాసిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నార‌ట‌. క‌మ‌ల్ హాస‌న్ అయితే కొద్దిసేపు షాక్‌లోనే ఉండిపోయార‌ట‌. ఆ త‌ర్వాత కోలుకుని స‌హాయ చ‌ర్య‌ల్లో పాలు పంచుకున్నార‌ట‌. ప్ర‌మాదం గురించి చ‌ర్చ ఒకెత్తైతే, శంక‌ర్ ప‌రిస్థితి ఎలా ఉంద‌నే విష‌యంపై జ‌రుగుతున్న చ‌ర్చ మ‌రో ఎత్తు. ఆయ‌న ఏ కండిష‌న్‌లో ఉన్నాడ‌నేది మ‌రికొన్ని గంట‌లు ఆగితే కానీ బ‌య‌టికి స‌మాచారం వ‌చ్చే ఆస్కారం లేదు. సినిమా ఇండ‌స్ట్రీలన్నీ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డేలా చేసిన ఈ సంఘ‌ట‌న త‌ర్వాత సెట్స్‌లో జాగ్రత్త‌లు ఎక్కువ‌య్యాయ‌ట‌. ఆచితూచి చిత్రీక‌ర‌ణ‌లు చేస్తున్నారు.