రివ్యూ: జాను

Last updated on February 27th, 2020 at 03:12 pm

నటీనటులు: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్ తదితరులు

దర్శకత్వం: సి ప్రేమ్ కుమార్

నిర్మాత: దిల్ రాజు

సంగీతం: గోవింద్ వసంత

విడుదల తేదీ: ఫిబ్రవరి 7, 2020

ముందుమాట‌
త‌మిళ సినిమాలు తెలుగులో రీమేక్ కావ‌డం కొత్త కాదు. కానీ ఎప్పుడూ జ‌ర‌గ‌నంత చ‌ర్చ `96` రీమేక్ విష‌యంలో జ‌రిగింది. హీరోహీరోయిన్లు శ‌ర్వానంద్‌, స‌మంత‌లు కూడా మేం ఈ సినిమాలో న‌టించ‌కూడ‌ద‌న‌కున్నాం కానీ దిల్‌రాజుపై న‌మ్మ‌కంతో న‌టించాం అన్నారు. క్లాసిక్ అనిపించుకున్న సినిమా `96`. అలాంటి సినిమాల్ని ట‌చ్ చేయ‌డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ దిల్‌రాజు ఎంతో ఇష్టంతో ఈసినిమాని తెలుగులోకి తీసుకొచ్చారు. `జాను` పేరుతో రూపొందించారు. త‌మిళంలో `96`ని తీసిన ద‌ర్శ‌కుడే ఇక్క‌డ కూడా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించారు. మ‌రి సినిమా ఎలా ఉంది? ఒరిజిన‌ల్ స్థాయిలోనే అనుభూతుల్ని పంచిందా? శ‌ర్వానంద్‌, స‌మంత‌ల న‌ట‌న ఎలా ఉంది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

క‌థ‌

రామ్ (శ‌ర్వానంద్‌) ఒక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్‌. త‌న స్నేహితులు పూర్వ విద్యార్థుల క‌ల‌యిక‌ని ఏర్పాటు చేయ‌డంతో ఊరికొస్తాడు. తాను చ‌దువుకున్న స్కూల్ ద‌గ్గ‌రికి వెళ‌తాడు. పాత జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకుంటాడు. అదే సమావేశానికి సింగ‌పూర్‌లో ఉన్న జానకి (స‌మంత‌) కూడా వ‌స్తుంది. రామ్‌, జాన‌కిల‌ది ప్ర‌త్యేక‌మైన బంధం. చిన్న‌ప్పుడు ఒక‌రంటే ఒక‌రికి అమిత‌మైన ప్రేమ‌. కొన్నేళ్ల త‌ర్వా త ఒక‌రినొక‌రు చూసుకున్న ఆ ఇద్ద‌రి మ‌ధ్య అంతే ప్రేమ ఉందా? ఒక‌రినొక‌ర‌రు చూసుకున్నాక వాళ్లు ఎలాంటి అనుభూతికి లోన‌య్యారు? జాన‌కి కోసం రామ్ ఏం చేశాడు? రామ్ కోసం జాన‌కి ఏం చేసింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌

రీమేక్ సినిమా అన‌గానే మాతృక‌తో పోల్చి చూడటం అల‌వాటు. ఎప్ప‌టికైనా రీమేక్ రీమేకే, ఒరిజిన‌ల్ ఒరిజిన‌లే. పోలిక‌ల్ని ప‌క్క‌న‌పెడితే `జాను` అనుభూతుల్ని పంచ‌డంలో విజ‌య‌వంత‌మైందని చెప్పొచ్చు. పోల్చి చూసుకుంటే మాత్రం రెండు సినిమాల మ‌ధ్య న‌క్క‌కీ నాగ‌లోకానికీ ఉన్న‌తంగా తేడా క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు మాతృక‌ని మ‌క్కీ మ‌క్కీకి దించాడు. అదే మేజిక్‌ని సృష్టించాల‌ని శ‌తథా ప్ర‌య‌త్నించాడు. శ‌ర్వానంద్‌, స‌మంత‌లు మాత్రం కాపీ కొట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. వాళ్ల‌దైన శైలిలో న‌టించారు. దాంతో సినిమాలో ఓ కొత్త మేజిక్ క‌నిపిస్తుంది. మాతృక‌ని చూడ‌ని ప్రేక్ష‌కుడు సినిమాని తొలి స‌న్నివేశం నుంచే ఆస్వాదిస్తాడు. తెర‌పై రామ్‌, జానుల‌ని… వాళ్ల జ్ఞాప‌కాల్ని చూస్తూనే ప్రేక్ష‌కుడు కూడా త‌నవైన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ క‌థ‌లో లీన‌మైపోతాడు. పాత్ర‌ల్లో త‌మ‌ని తాము చూసుకుంటూ భావోద్వేగాల‌కి గుర‌వుతాడు. లైఫ్ ఆఫ్ రామ్ పాట‌తో క‌థ మొద‌ల‌వుతుంది. స్నేహితులంతా క‌లిసి పూర్వ విద్యార్థుల స‌మావేశం ఏర్పాటు చేయ‌డం, దానికోసం రామ్ రావ‌డం, స్కూల్‌ని చూస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ల‌డం జరుగుతుంది. అక్క‌డి నుంచి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళుతుంది సినిమా. రీ యూనియ‌ర్ వేడుక త‌ర్వాత మ‌ళ్లీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళుతుంది. జాను సింగ‌పూర్ నుంచి రావ‌డంతో తొలి ప్రేమ‌లోని అనుభూతులన్నీ తెర‌పై అందంగా ఆవిష్కృత‌మ‌వుతాయి. ఇంట‌ర్వెల్ బ్లాక్ సినిమాకి హైలెట్‌. రామ్ ఇంకా పెళ్లి చేసుకోలేద‌ని తెలిసిన‌ప్పుడు జాన‌కి స్పందించే విధానం, అక్క‌డ పండిన భావోద్వేగాలు సినిమాకే హైలెట్‌. అక్క‌డ‌క్క‌డా నిదానంగా సాగే స‌న్నివేశాలు కొంచెం ఇబ్బందిక‌రంగా అనిపిస్తాయి. రామ్‌, జాను ఒక రాత్రంతా క‌లిసి గ‌డ‌పాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అప్పుడేం జ‌రిగిందనేది ద్వితీయార్థంలో కీల‌కం. భావోద్వేగాలు కీల‌క‌మైన ద్వితీయార్థం మంచి టెంపోతో సాగింది. ప్ర‌తి స‌న్నివేశం కూడా మ‌న జీవితాల్ని స్పృశిస్తూ పాత జ్ఞాపకాల్ని త‌ట్టి త‌డుముతుంది. శ‌ర్వానంద్‌, స‌మంత‌ల పాత్ర‌ల‌పైనే ఈ సినిమా సాగుతుంటుంది. వాళ్లిద్ద‌రూ ఒక‌రికొక‌రు పోటీ ప‌డి న‌టించారు. వీళ్లు త‌ప్ప మ‌రొక‌రు ఇంత‌గా మేజిక్ సృష్టించ‌లేర‌నిపించేలా పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. మాతృక‌ని చూడ‌నివాళ్లు, చూసినా దానితో పోల్చుకోకుండా సినిమాని ఆస్వాదించేవాళ్ల‌కి ఒక మంచి అనుభూతుల ప్ర‌యాణంగా నిలిచిపోతుందీ చిత్రం.

న‌టీన‌టులు… సాంకేతిక‌త‌

శ‌ర్వానంద్‌, స‌మంత‌లే ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. రామ్‌, జానులుగా వంద‌శాతం పాత్ర‌ల్ని ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు. చిన్న‌ప్ప‌టి రామ్‌, జానులుగా క‌నిపించిన సాయికుమార్‌, గౌరి కూడా మెప్పిస్తారు. స‌హజ‌మైన అభిన‌యంతో ఆక‌ట్టుకుంటారు. ఇక మిగిలిన పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. గోవింద్ వ‌సంత సంగీతం, మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్‌తో ముడిప‌డిన సినిమాల‌కి క‌ళా విభాగం కీల‌కం. రామాంజ‌నేయులు చిన్న‌నాటి స్కూల్‌ని, ఆ వాతావ‌ర‌ణాన్ని గుర్తుచేసేలా ప్రొడ‌క్ష‌న్ డిజైన్ చేసిన విధానం బాగుంది. మాతృక‌ని తీసిన ద‌ర్శ‌కుడు ప్రేమ్‌కుమారే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి ఆయ‌న త‌న క‌థ‌పై ప‌ట్టుని ప్ర‌ద‌ర్శిస్తూ మ‌రోసారి ఆ మేజిక్‌ని సృష్టించాల‌ని ప్ర‌య‌త్నించాడు. ఆ విష‌యంలో కొద్దమేర‌కే విజ‌యం సాధించాడు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

రేటింగ్: 2.75/5

చివ‌రిగా: `96` చూడ‌నివాళ్ల‌కి `జాను` తప్ప‌కుండా న‌చ్చుతుంది