ఇసుక మాఫియాకి చెక్…ఇక ఆన్ లైన్ లోనే

ఇసుక కావాల్సిన వారు బుకింగ్‌ కోసం ఏపీఎండీసీ శాండ్‌ పోర్టల్‌ను క్లిక్‌ చేస్తే చాలు సమగ్ర వివరాలు ఉంటాయి. రాష్ట్రంలోని ఏయే స్టాక్‌ యార్డుల్లో ఎంతెంత ఇసుక నిల్వ ఉందో కూడా అందులో కనిపిస్తుంది. సమీప ప్రాంతంలోని స్టాక్‌ యార్డు నుంచి ఇసుక సరఫరా కోసం బుక్‌ చేసుకోవచ్చు.

రాష్ట్రంలో ఇసుక కోసం ఇక మాఫియా గ్యాంగులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అక్కడ ఎంత ధర ఉంది? ఇక్కడ ఎంత రేటు ఉంది? అని వాకబు చేయాల్సిన అవసరమూ లేదు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఇకపై ఇసుకను సరసమైన ధరలకు అందించనుంది. రాష్ట్రంలో ఎక్కడుకు ఇసుక కావాలన్నా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే చాలు నేరుగా కోరిన ప్రాంతానికే సరఫరా చేసే ఏర్పాట్లను ఈ సంస్థ చేస్తుంది. ఏపీఎండీసీ శాండ్‌ పోర్టల్‌లోకి వెళ్లి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఇసుకను బుక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఇసుక సరఫరాకు కొత్త విధాన ముసాయిదా (పాలసీ) రూపొందించింది. గత అయిదేళ్లుగా టీడీపీ నాయకులు సాగిస్తున్న ఇసుక మాఫియాకు చెక్‌ పెట్టడం, ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా ప్రభుత్వ రాబడి పెంచడం లక్ష్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు పాత పాలసీని రద్దుచేసి కొత్త పాలసీ రూపొందించింది. ప్రజలకు పారదర్శక సుపరిపాలనే అజెండాగా పెట్టుకున్న కొత్త ప్రభుత్వం ఇసుక రేవులను ప్రయివేటు వ్యక్తుల కబంధ హస్తాల నుంచి తప్పించి ప్రభుత్వ అధీనంలో ఉంచాలని నిర్ణయించుకుని ఆంధ్రప్రదేశ్‌ ఇసుక విధానం (ముసాయిదా) – 2019ను రూపొందించింది. దీనిని ముఖ్యమంత్రి పరిశీలనకు పంపించి ఆమోదం పొందనున్నారు. అనంతరం కేబినెట్‌ ఆమోదంతో జీఓ జారీ చేయడం ద్వారా కొత్త విధానం అమల్లోకి వస్తుంది.