యాత్ర‌ ఈవెంట్‌కు జ‌గ‌న్ రాలేదేం?

వైయ‌స్సార్ జీవిత‌క‌థ‌లో పాద‌యాత్ర ఘ‌ట్టాన్ని కీల‌కంగా తీసుకుని తెర‌కెక్కించిన `యాత్ర‌` చిత్రం ఈనెల 8న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో మ‌హి.వి.రాఘ‌వ్ దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని విజ‌య్ . చిల్లా, శ‌శిదేవిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్ ఎన్ క‌న్వెన్ష‌న్  లో జ‌రిగింది. ఈ వేడుక‌కు మ‌మ్ముట్టి, మ‌హి.వి.రాఘ‌వ్ త‌దిత‌రులు ఎటెండ్ అయ్యారు. వేడుక ఆద్యంతం వైయ‌స్, జ‌గ‌న్ అభిమానులు ర‌చ్చ ర‌చ్చ చేశారు.
అయితే ఈ వేదిక‌కు వైయ‌స్ జ‌గ‌న్ రాక‌పోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు, జ‌గ‌న్ అభిమానులు క‌నిపించినా య‌త్ర‌ వేడుక‌లో జ‌గ‌న్ మిస్స‌వ్వ‌డంపై అభిమానులు చ‌ర్చించుకున్నారు. అయితే జ‌గ‌న్ రాక‌పోవ‌డానికి కార‌ణ‌మేంటో ద‌ర్శ‌కుడు ఓ హింట్ ఇచ్చారు. ఈ వేడుక చేయాలి అని అనుకున్న‌ప్పుడు వైయ‌స్సార్ అభిమానులే అతిధులుగా వ‌స్తే బావుంటుంద‌ని భావించి వాళ్ల‌ను ఆహ్వానించామ‌ని తెలిపారు. ఇక వైయ‌స్ జ‌గ‌న్ సైతం మీరు మీ నాయ‌కుడి సినిమా తీయాల‌నుకున్నారు.. ఆయ‌న చేసినది మాత్ర‌మే చూపించండి.. చేయ‌నిది చూపించ‌వ‌ద్దు! అని చెప్పారు జ‌గ‌న్. మీ సినిమాలో నా ప్ర‌మేయం ఎందుకు? అని అన్నార‌ని తెలిపారు.  దాన‌ర్థం.. ఇప్పుడు ఈ ఈవెంట్‌కి జ‌గ‌న్ రావాల్సిన ప‌ని లేద‌నేది ఉద్ధేశం అని అర్థ‌మైంది.  వైయ‌స్ జ‌గ‌న్  ఈ వేడుక‌కు విచ్చేస్తే రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంటుంది. అలాగే ఇప్ప‌టికే ఈ సినిమాపై ర‌క‌ర‌కాల వివాదాలు ముసురుకున్నాయి. మూవీ రిలీజ్ ఆపాల‌ని ఓ ఆసామి చెన్న‌య్ హైకోర్టులో కేసు వేసిన సంగ‌తి తెలిసిందే. అందుకే జ‌గ‌న్ ఈ వేడుక‌కు రాలేద‌న్న ముచ్చ‌టా సాగింది.