మోసానికి గురై రోడ్డెక్కిన జగపతి బాబు

సౌత్ లో ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆరిస్టుగా మంచి ఫామ్ లో ఉన్న టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు తాజాగా ఓ సంస్థ కారణంగా మోసపోయానని నిరసన బాట పట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ స్టోరీలోకి వెళితే, మెట్రో నగరాల్లో ప్రముఖ బిల్డర్ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న లోధా సంస్థ తమను మోసం చేసిందని వివరిస్తూ మిగిలిన బాధితులతో కలిసి తాజాగా జగపతి బాబు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా కూకట్ పల్లిలో విలాసవంతమైన బెలిజా అపార్ట్మెంట్ నిర్మిస్తామని చెప్పి లోధా సంస్థ చివరకు మోసం చేసిందని అందరూ ఆరోపించారు. అంతేకాకుండా తమకు 10.5 ఎకరాల స్థలంలో విలాసవంతమైన ఫ్లాట్లను నిర్మిస్తామని చెప్పి కేవలం మూడు ఎకరాల్లో మాత్రమే మెరిడియన్ అపార్ట్మెంట్ లు నిర్మించారని జగపతి బాబు చెప్పుకొచ్చారు.
అలాగే జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా కాంపౌండ్ వాల్ నిర్మించారని, దీంతో లోధా సంస్థ ప్రచారానికి చాలామంది నమ్మి మోస పోయినట్లు అయిందని, అందుకే తామిప్పుడు రోడ్డెక్కాల్సి వచ్చిందని అన్నారు. ఇదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా తమ స్వేచ్చకు భంగం కలిగేలా వ్యవహరించిన లోధా సంస్థపై జీహెచ్ఎంసీ వర్గాలకు ఫిర్యాదు చేయనున్నట్లు జగపతి బాబు తెలిపారు. మరోవైపు, జగపతి బాబుతో పాటు మోసానికి గురైన మిగిలిన వినియోగదారులు కూడా లోధా సంస్థపై తీవ్రంగా మండిపడుతూ.. ఈ విషయంలో జెహెచ్ఎంసీ న్యాయం చేయాలని, లేదంటే తాము హైకోర్టును ఆశ్రయిస్తామని తేల్చి చెప్పేశారు. మరి ఈ లెక్కన జగపతి బాబు లాంటి స్టార్ ఈ బాధితుల్లో ఉన్నందుకైనా అందరికీ తొందరగా న్యాయం జరుగుతుందేమో చూడాలి.