`సైరా`లో జ‌గ‌ప‌తి లుక్ అదిరిందిగా!

Last Updated on by

శోభ‌న్‌బాబు త‌రువాత లేడీస్‌లో మంచి ఫాలోయింగ్ వున్న హీరోగా పేరుతెచ్చుకున్న జ‌గ్గూభాయ్ జ‌గ‌ప‌తిబాబు ట్రెండు మార్చి కొత్త త‌ర‌హా పాత్ర‌ల‌కు జీవం పోస్తున్న విష‌యం తెలిసిందే. బాల‌య్య‌, బోయ‌పాటిల `లెజెండ్‌` సినిమాతో విల‌న్ పాత్ర‌ల‌కు క్ష‌కారం చుట్టిన జ‌గ్గూభాయ్ త‌న పంథాకు భిన్నంగా అడుగులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన‌ `రంగ‌స్థ‌లం`లో ప్రెసిడెంటు పాత్ర‌లో ఆక‌ట్టుకున్న జ‌గ‌ప‌తిబాబు తాజాగా చిరంజీవి న‌టిస్తున్న చారిత్రాత్మ‌క సినిమాలో మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

చిరంజీవి క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హింస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హీరో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ ప‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా  అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. మంగ‌ళ‌వారం జ‌గ‌ప‌తిబాబు పుట్టిన రోజును పుర‌స్కరించుకుని చిత్ర బృందం ఆయ‌న‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేసింది. సినిమాలో జ‌గ్గూభాయ్ వీరారెడ్డి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. పెద్ద పెద్ద మీసాలు, గుబురు గ‌డ్డంతో త‌ల‌పాగా ధ‌రించి క‌నిపిస్తున్న జ‌గ‌ప‌తి లుక్ ఆక‌ట్టుకుంటోంది.

ఫ‌స్ట్‌లుక్ ని బ‌ట్టి చూస్తే జ‌గ‌ప‌తి పాత్ర కొత్త‌గా వుంటుంద‌నే సంకేతాల్ని అందిస్తోంది. అమితాబ్ బ‌చ్చ‌న్ రాజ‌గురువుగా, విజ‌య్ సేతుప‌తి సైరా స‌హ‌చ‌రుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, త‌మ‌న్నా క‌థానాయిక‌లుగా క‌నిపించ‌నున్నారు. క‌న్న‌డ హీరో సుదీప్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ముస్తాబు చేసి ఆగ‌స్టు 15న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. వీరారెడ్డి పాత్ర జ‌గ్గూభాయ్ సినీ కెరీర్‌లో మ‌రో మ‌ర‌పురాని పాత్ర‌గా మిగిలిపోవ‌డం ఖాయం.

User Comments