జై సింహా రివ్యూ

రివ్యూ: జై సింహా

నటీనటులు: బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, ప్రకాశ్ రాజ్, నటాషా దోషీ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కేయస్ రవికుమార్

సంక్రాంతికి బాలయ్య సినిమా అంటే హిట్ బొమ్మ అనే నమ్మకం అభిమానుల్లో ఉంటుంది. మరి ఈ సారి కూడా బాలయ్య నిజంగానే బొమ్మ చూపించాడా.. గతేడాది మాదిరే శాతకర్ణిలా హిట్ కొట్టాడా..?

కథ:

నరసింహా(బాలయ్య) తన కొడుకుతో కలిసి ఎక్కడైనా ప్రశాంతంగా జీవితం గడుపుదామని రాష్ట్రాలన్నీ తిరుగుతుంటాడు. చివరికి కుంభకోణం వచ్చి అక్కడ సెటిలవుతాడు. అక్కడే ఆలయ ధర్మకర్త(మురళీమోహన్) ఇంట్లోనే ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు ధర్మకర్త కూతురు (నటాషా) ఓ యాక్సిడెంట్ చేసి కుంభకోణంలోని దాదా కనియప్పన్(కాలకేయ ప్రభాకర్) తమ్మున్ని యాక్సిడెంట్ చేస్తుంది. ఆ నేరం తనమీద వేసుకుంటాడు నరసింహా. ఆ తర్వాత అతడు చనిపోతాడు. దాంతో నరసింహాపై పగ పెంచుకుంటాడు కనియప్పన్. అదే టైమ్ లో తన కొడుకు చావుకు కారణమైన నరసింహాను చంపాలని పగతో రగిలిపోతుంటాడు మరో విలన్(అశుతోష్ రాణా). వీళ్ళందరి మధ్యలోకి గౌరి(నయనతార) వస్తుంది. అసలు గౌరీకి నరసింహాకు సంబంధం ఏంటి.. ఎందుకు అందరికి నరసింహా టార్గెట్ అవుతాడు అనేది కథ.

కథనం:

బాలయ్య సినిమా అంటే మాస్ అని అర్థం. కేయస్ రవికుమార్ దాన్ని బాగా అర్థం చేసుకున్నట్లున్నాడు. అందుకే ఊహించిన దానికంటే ఎక్కువే మాస్ కథ తీసుకొచ్చాడు ఈ దర్శకుడు. 90స్ కాలం నాటి కథ తీసుకొచ్చి బాలయ్యను మెప్పించాడు. అదే కథకు రేసీ స్క్రీన్ ప్లే జోడించి ఫ్యాన్స్ కు కూడా ఫీస్ట్ ఇచ్చాడు రవికుమార్. సాధారణ ప్రేక్షకులకు కూడా జై సింహా ఓకే అనిపిస్తుంది. కాకపోతే ఎన్నో ఏళ్లుగా చూస్తోన్న ఫార్ములనే మళ్లీ తీసుకోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్. తొలి సీన్ లోనే ఖైదీలో రంగనాథ్ చిరంజీవిని ఆపే సీన్ గుర్తుకు తెచ్చాడు దర్శకుడు. ఆ తర్వాత బాలయ్య మాస్ పవర్ నే నమ్ముకున్నాడు దర్శకుడు. దాన్ని వాడుకుంటూ సీన్స్ అల్లుకున్నాడు. బ్రాహ్మణుల గురించి చెప్పే సీన్.. ఇంటర్వెల్ ముందు సీన్.. ఇవన్నీ బాలయ్య ఇమేజ్ తో బాగా పేలాయి.

ఇక జై సింహాకు బాగా అడ్డు అనిపించేది కామెడీ. బ్రహ్మాంనందంతో చేయించిన కామెడీ అరవ వాసనలు కొట్టింది. సినిమాకు ఇదే పెద్ద బ్రేక్. సెకండాఫ్ లోనూ టెంపో ఎక్కడా తగ్గలేదు. అయితే నయనతార, బాలయ్య మధ్య లవ్ సీన్స్ మాత్రం ఆకట్టుకోలేదు. అందుకే ఫన్నీగా సీన్స్ రాసుకున్నాడు. విలన్ కొడుక్కి ఎంపి కాకుండా హీరో అడ్డుపడటం.. ఆ తర్వాత అతడు ఉరేసుకోవడం.. దాంతో హీరోపై విలన్ పగ పెంచుకోవడం.. ఇవన్నీ చాలా సినిమాల్లో చూసిన సీన్లే.. కానీ వాటిని కూడా మాస్ కు రీచ్ అయ్యేలా తెరకెక్కించాడు కేయస్ రవికుమార్. క్లైమాక్స్ లో ఎమోషన్ కూడా బాగానే పండించాడు. అయితే మరీ త్యాగాలు చేయడం మాత్రం కాస్త ఓవర్ అనిపిస్తుంది.

నటీనటులు:

బాలయ్య బాగా చేసాడు అని చెప్పడం అవివేకమే అవుతుంది. ఎందుకంటే ఆయన ఇలాంటి కారెక్టర్లు ఎన్నో చేసాడు. బాషా టైప్ లో ప్లాష్ బ్యాక్ పెట్టుకుని వచ్చిన సినిమాలు బోలెడు. జై సింహా కూడా ఈ గుంపులో ఒకటి. నయనతార ఉన్నంతలో బాగానే చేసింది. హరిప్రియ ఓకే. నటాషా దోషీ పాత్ర కేవలం అందాలకే పరిమితమైంది. ప్రకాశ్ రాజ్ మరోసారి తనకు అలవాటైన తండ్రి పాత్రలో మెప్పించాడు. విలన్ గా అశుతోష్ రాణా ఓకే.. కాలకేయ ప్రభాకర్ కూడా బాగానే చేసాడు. బ్రహ్మానందం పెద్దగా ఆకట్టుకోలేదు.

టెక్నికల్ టీం:

సంగీతం ఈ చిత్రానికి మైనస్ గా మారింది. శాతకర్ణికి బాగానే మ్యూజిక్ ఇచ్చిన ఈయన జై సింహాకు మాత్రం ఊహించినంత ఇవ్వలేదు. అయితే జజ్జనక పాట మాత్రం ఫ్యాన్స్ కు పిచ్చెక్కించడం ఖాయం. సినిమాటోగ్రఫీ పర్లేదు. 90ల్లో సినిమా చూసినట్లుగా అనిపించింది. ఇక ఎడిటింగ్ వీక్. కథ విషయంలో కేఎస్ రవికుమార్ ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. కథనం వేగంగా ఉండటం ఈ చిత్రానికి బలం. తెలిసిన కథనే రేసీ స్క్రీన్ ప్లే తో పరుగులు పెట్టించాడు రవికుమార్. ఓవరాల్ గా మాస్ కు ఈ చిత్రం పండగ.

చివరగా:

సంక్రాంతి సింహం గర్జించింది.. కానీ కొంచెం మెల్లగా..

రేటింగ్: 2.75/5