జ‌ంబ ల‌కిడి పంబ‌ రివ్యూ

Last Updated on by

రివ్యూ: జ‌ంబ ల‌కిడి పంబ‌

న‌టీన‌టులు: శ్రీ‌నివాస‌రెడ్డి, సిద్ధి ఇర్నాని, పోసాని, వెన్నెల కిషోర్, త‌ణికెళ్ల భ‌ర‌ణి..

సంగీతం: గోపీసుంద‌ర్

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: జేబి ముర‌ళి కృష్ణ‌

జ‌ంబ ల‌కిడి పంబ‌.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తొచ్చేది ఇవివి స‌త్య‌నారాయ‌ణ‌. 20 ఏళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌నం విజ‌యం సాధించింది. తెలుగు సినిమా ఆల్ టైమ్ కామెడీ క్లాసిక్స్ లో ఒక‌టిగా నిలిచింది. మ‌రి ఆ టైటిల్ తో వ‌చ్చిన ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది..?

క‌థ‌:

వ‌రుణ్ (శ్రీ‌నివాస‌రెడ్డి), ప‌ల్ల‌వి (సిద్ధి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వ‌రుణ్ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా.. ప‌ల్ల‌వి ఫ్యాష‌న్ డిజైన‌ర్ గా ప‌ని చేస్తుంటారు. పెల్లైన కొన్ని రోజుల‌కే గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. దాంతో విడాకుల కోసం ఫేమ‌స్ లాయ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్(పోసాని)ని క‌లుస్తారు. కానీ అనుకోకుండా యాక్సిడెంట్ లో చ‌నిపోతాడు. ఆ త‌ర్వాత ఆత్మ‌గా వ‌చ్చి ఇద్ద‌ర్ని ఇబ్బంది పెడుతుంటాడు. అస‌లు ఆయ‌న ఆత్మ ఎందుకు అయ్యాడు..? మ‌ధ్య‌లో జూనియ‌ర్ లాయ‌ర్ (వెన్నెల కిషోర్) ఎందుకు వ‌రుణ్, ప‌ల్ల‌విని టార్చ‌ర్ పెడుతుంటాడు అనేది అస‌లు క‌థ‌..!

క‌థ‌నం:

జ‌ంబ ల‌కిడి పంబ అన‌గానే ఆడ‌.. మ‌గ జెండ‌ర్స్ మార్పిడి గుర్తొస్తుంది. అప్ప‌ట్లో ఇవివి చేసిన ఈ ప్ర‌యోగం ఊహించ‌ని విధంగా స‌క్సెస్ అయింది. ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత శ్రీ‌నివాస‌రెడ్డి ఈ కాన్సెప్ట్ తో సినిమా చేసాడు. మ‌ధ్య‌లో చాలా మంది జ‌ంబ ల‌కిడి పంబ కాన్సెప్ట్ తీసుకోవాల‌ని ట్రై చేసినా భ‌య‌ప‌డ్డారు. కానీ శ్రీ‌నివాస‌రెడ్డి మాత్రం కొత్త ద‌ర్శ‌కుడు ముర‌ళి కృష్ణ చెప్పింది న‌మ్మి అడుగేసాడు. ముందు నుంచి వాళ్ల‌పై భ‌యం ఎక్కువ‌గా ఉందేమో కానీ ఎక్క‌డా పాత జ‌ంబ ల‌కిడి పంబ‌ను గుర్తు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. కానీ కొత్త జ‌ంబ ల‌కిడి పంబ చూపించ‌బోయి చ‌తికిల ప‌డ్డారు. కామెడీ లేక‌పోగా వెగ‌టు పుట్టించేలా సీన్స్ వ‌స్తుంటాయి. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ల‌తో ప్రేక్ష‌కుల త‌ల‌కు బొప్పి క‌డుతుంది. ప‌ర్లేదులే అస‌లు కాన్సెప్ట్ మొద‌లైన త‌ర్వాత కామెడీ వ‌స్తుందేమో అనుకుంటే అస‌లు న‌ర‌కం అప్ప‌ట్నుంచే మొద‌ల‌వుతుంది.

మ‌రీ ముఖ్యంగా శ్రీ‌నివాస‌రెడ్డిని అమ్మాయిగా అస్స‌లు చూడ‌లేరు ప్రేక్ష‌కులు. అమ్మాయి పాత్ర‌లో పెద్ద‌గా తేడా క‌నిపించ‌దు. ఆమెది జెండ‌ర్ మార‌క ముందు కూడా టామ్ బాయ్ లాగే ఉండ‌టం వ‌ల్లో ఏమో కానీ ఆ తేడా క‌నిపించ‌దు. క్లైమాక్స్ వ‌ర‌కు శ్రీ‌నివాస‌రెడ్డిని జ‌ంబ ల‌కిడి పంబ కాన్సెప్ట్ తో చూడ‌లేక ప్రేక్ష‌కుల‌కు తిప్ప‌లు త‌ప్ప‌వు. చ‌చ్చిపోయిన లాయ‌ర్ కు స్వ‌ర్గంలో భార్య ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే విడిపోయే వీళ్లిద్ద‌ర్ని క‌లిపాలి అని దేవుడు కండీష‌న్ పెట్ట‌డం వింత‌గా అనిపించినా.. దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం అస్స‌లు ఆక‌ట్టుకోలేదు. దాంతో జ‌ంబ ల‌కిడి పంబ కాస్తా పంబ జంబ లంబ ల‌కిడి అయిపోయింది.

న‌టీన‌టులు:

శ్రీ‌నివాస‌రెడ్డి కమెడియ‌న్ గా ఇప్ప‌టికే పాపుల‌ర్. ఆయ‌న కామెడీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ జ‌ంబ ల‌కిడి పంబ కాన్సెప్ట్ మాత్రం ఈయ‌న‌కు అస్స‌లు సూట్ కాలేదు. అమ్మాయి వేశంలో అస‌లు శ్రీ‌నివాస‌రెడ్డిని చూడ‌టం కూడా వెగ‌టుగా అనిపిస్తుంది. కొత్త హీరోయిన్ సిద్ధి బానే చేసింది. ఈమె జెండర్ మారిన త‌ర్వాత కూడా తేడా అనిపించ‌దు. పోసాని లాయ‌ర్ గా న‌వ్వులు పూయించాడు. అక్క‌డ‌క్క‌డా ఈయ‌నే కాస్త న‌వ్వు తెప్పించాడు. వెన్నెల కిషోర్ కూడా ప‌ర్లేదు. హ‌రితేజ‌.. త‌ణికెళ్ల.. ర‌ఘుబాబు వీళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే పాత్ర‌లే.

టెక్నిక‌ల్ టీం:

నిన్నుకోరి లాంటి ఫీల్ గుడ్ సినిమాల‌కు సంగీతం అందించిన గోపీసుంద‌రేనా ఈ సినిమాకు కూడా సంగీతం అందించాడు అనిపిస్తుంది పాట‌లు వింటుంటే. ఒక్క‌టి కూడా పెద్దగా ఆక‌ట్టుకోలేదు. టైటిల్ సాంగ్ మాత్రం ప‌ర్లేద‌నిపిస్తుంది. ఇక సినిమాటోగ్ర‌ఫీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఎందుకంటే అక్క‌డ చూపించ‌డానికి కూడా విజువ‌ల్స్ ఏం లేవు. ఎడిటింగ్ వీక్. రెండు గంట‌ల 21 నిమిషాల సినిమా బోర్ కొడుతుంది. మ‌ధ్య‌లో కొన్ని సీన్లు చిరాకు కూడా తెప్పిస్తాయి. ద‌ర్శ‌కుడిగా తొలి సినిమాకే ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవ‌డం ముర‌ళీకృష్ణ చేసిన సాహ‌స‌మే అయినా.. దాన్ని డీల్ చేయ‌డంలో మాత్రం విఫ‌లం అయ్యాడు.

చివ‌ర‌గా:

జ‌ంబ ల‌కిడి పంబ‌.. పంబ జంబ లంబ ల‌కిడి..

రేటింగ్: 1.75/5.0

User Comments