అమ‌రావ‌తిపై జ‌న‌సేనాని పుస్త‌కం

ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు త‌ర‌లిస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడు రాజ‌ధానుల కాన్సెప్టుతో ఒక సామాజిక వ‌ర్గం రియ‌ల్ ఎస్టేట్ ని స‌మ‌ర్ధించ‌ని యువ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని.. న‌మ్మిన పార్టీ నాయ‌కుడినే న‌ట్టేట ముంచిన చోట రాజ‌ధాని ఉండాల్సిన ప‌నే లేద‌ని జ‌గ‌న్ అన్నార‌ని ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ సాగుతోంది. ఇక అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ కాన్సెప్టుతో మూడు రాజ‌ధానుల్ని తెర‌పైకి తేవ‌డంతో అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల్లో దీనిపై ఉత్సాహం నెల‌కొంది. వెన‌క బాటు నుంచి బ‌య‌ట‌ప‌డే అరుదైన అవ‌కాశం ఇద‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

అయితే ఈ సంద‌ర్భంగా అమ‌రావతి రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతుల క‌ష్టాల్ని జ‌నసేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వింటున్నారు. అంతేకాదు.. అక్క‌డ ప‌రిస్థితుల‌పై తాజాగా జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. జనసేనాని పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అమరావతి రాజధాని… ప్రస్తుత పరిస్థితులు, పరిశీలన అనే పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. పార్టీ సమావేశంలో అన్ని ప్రాంతాల నేతలను పిలిపించిన పవన్ వారు చెప్పిన అభిప్రాయాలను శ్రద్ధగా వినడమే కాదు ఓ పుస్తకంలో రాసుకున్నారు.