జ‌న‌సేనాని యూట‌ర్న్‌!

Last Updated on by

ఏపీ రాజకీయాల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌కంప‌నాల గురించి తెలిసిందే. అయితే జ‌న‌సేన‌ను క‌లుపుకోవాల‌ని తేదేపా ఓవైపు బిగ్ స్కెచ్ వేస్తోంది. మ‌రోవైపు ప‌వ‌న్ – జ‌గ‌న్ ల‌ను క‌ల‌పాల‌ని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇవేవీ అంత సులువుగా జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ట‌. అఖిల ప‌క్ష స‌మావేశం పేరుతో జ‌న‌సేన‌కు ద‌గ్గ‌ర కావాల‌ని టీడీపీ అధినేత వేసిన ఎత్తును ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిత్తు చేశారు. బుధ‌వారం అఖిల ప‌క్షం పేరుతో చంద్ర‌బాబు నాయుడు పంపిన ఆహ్వానాన్ని తిర‌స్క‌రించి ప‌వ‌న్ గ‌ట్టి షాకిచ్చారు. దీనిపై చంద్ర‌బాబుకు ఘాటు లేఖ‌ను సంధించిన జ‌న‌సేనాని ఇలాంటి మొక్కుబ‌డి స‌మావేశాల‌కు జ‌న‌సేన రాద‌ని తేల్చి చెప్ప‌డం ఏనీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బుధ‌వారం అఖిల ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేసి మాకు మాత్రం మొక్కుబ‌డిగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఏదో చెప్పాలి కాబ‌ట్టి చెప్పిన‌ట్టుగా ఆహ్వానం పంప‌డాన్ని ఏమ‌ని అర్థం చేసుకోవాల‌ని నిల‌దీశారు.

ఆల‌స్యంగా మ‌మ్మ‌ల్ని ఆహ్వానించినందుకు కృత‌జ్ఞ‌త‌లు. అయితే త‌గిన స‌మ‌యం ఇవ్వ‌కుండా, అస‌లు స‌మావేశ ఎజెండా ఏంటో చెప్ప‌కుండా స‌మావేశాలు ఏంట‌ని, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఈ స‌మావేశం రాజ‌కీయ ల‌బ్దికోస‌మే అనే సందేహాలున్నాయ‌ని మండిపడ్డారు ప‌వ‌న్‌. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం సంఘ‌టితంగా కేంద్రంపై పోరాటానికి జ‌న‌సేన ఎప్పుడూ సిద్ధంగా వుంటుంద‌ని మ‌రోసారి పున‌రుద్ఘాటించారు. అయితే ఇలాంటి చ‌వ‌క‌బారు స‌మావేశాల‌కు మాత్రం జ‌న‌సేన ఎప్పుడూ దూరంగానే వుంటుంద‌ని తేల్చి చెప్ప‌డం టీడీపీ శ్రేణుల్లో క‌ల‌వ‌రాన్ని క‌లిగిస్తోంది. హోదా కోసం చాటు మాటు మీటింగులు కాద‌ని, ధైర్యంగా ముందుకొచ్చి బ‌ల‌మైన పోరాటం చేయ‌డానికి జ‌న‌సేన ఎప్పుడూ సిద్ధంగా వుంటుంద‌ని, అలాంటి పోరాటానికి ఎవ‌రు ముందుకు వ‌చ్చినా జ‌న‌సేన క‌లిసి పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

User Comments