జ‌వాన్ న‌డ‌వ‌డం కాదు.. ప‌రిగెడుతున్నాడు..

ఒక్కోసారి అంతే.. బ్రేక్ వేసిన బండిలా సినిమాలు ముందుకు క‌ద‌ల‌వు. కొన్నిసార్లు మాత్రం ఎవ‌రో వెన‌క నుంచి తోసిన‌ట్లుగా ముందుకు దూసుకెళ్ళి పోతుంటుంది. ఇప్పుడు జ‌వాన్ విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. అన్నీ బాగుంటే ఈ పాటికే సినిమా టీవీల్లో కూడా వ‌చ్చేసేది. ఆగ‌స్ట్ 11నే విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం.. సెప్టెంబ‌ర్ 1 అని.. ఆ త‌ర్వాత ద‌స‌రా అని.. దీపావళి అని డేట్లు మార్చుకుంటుందే గానీ బ‌య‌టికి రావ‌ట్లేదు. ఈ చిత్రం ద‌ర్శ‌కుడు బివిఎస్ ర‌వికి ఎంత కీలక‌మో తెలియ‌దు కానీ సాయిధ‌రంతేజ్ కు మాత్రం చాలా కీల‌కం. తిక్క‌.. విన్న‌ర్ లాంటి డిజాస్ట‌ర్ల త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సాయికి క‌చ్చితంగా ఓ హిట్ ప‌డాలి.

మంచి మార్కెట్ ను త‌న‌కు తానే కిల్ చేసుకుంటున్నాడు ఈ హీరో. ఇన్నాళ్లూ షెడ్ లోనే ఉన్న ఈ చిత్రం బ‌య‌టికి వ‌స్తుంది. న‌వంబ‌ర్ 19న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌బోతుంది. దిల్ రాజు క్యాంపైన్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత సాయిధ‌రంతేజ్ కు హిట్ లేదు. చాన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ దిల్ రాజు గృహంలోకి అడుగుపెట్టాడు సాయిధ‌రం. జ‌వాన్ కు ప్ర‌జెంటర్ గా ఉన్న దిల్ రాజు.. ఈ చిత్రం ఔట్ పుట్ న‌చ్చ‌క రీ షూట్లు కూడా చేయించాడు. ఇప్పుడు రాజుగారు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఔట్ పుట్ చూసి. అందుకే న‌వంబ‌ర్ 19న ప్రీ రిలీజ్ వేడుక చేస్తున్నారు. ఈ ఈవెంట్ గ్రాండ్ గా చేసి ప్రేక్ష‌కుల్లోకి త‌మ సినిమాను తీసుకెళ్లాల‌నే యోచ‌న‌లో ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. డిసెంబ‌ర్ 1న జ‌వాన్ విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే పాట‌లు కూడా ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందించాడు.