జేడీ ఎంత ప‌ని చేశావ్‌?

టాలీవుడ్‌లో ద‌శాబ్ధం పాటు హీరోగా వెలిగిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి అలియాస్ గ‌డ్డం చ‌క్ర‌వ‌ర్తి అటుపై ద‌ర్శ‌కుడిగా అవ‌తారం ఎత్తిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు న‌టిస్తూనే, అప్పుడ‌ప్పుడు మెగా ఛైర్‌ని చేతిలోకి లాక్కుంటున్నాడు. అయితే ద‌ర్శ‌కుడిగా జేడీ గురువును మించిన శిష్యుడు కాలేక‌పోయాడు. ఆర్జీవీని క‌లియుగ క‌లి అవ‌తారంగా భావించే జేడీ చ‌క్ర‌వ‌ర్తి.. గురుభ‌క్తిని చాటుకునే తీరు అంతే విభిన్నంగా ఉంటుంది. అస‌లు ఆర్జీవీ శిష్య‌బృందంలో మేధోత‌నం ఉన్న‌వాడిగా జేడీ ఫీల‌వ్వ‌డం వెన‌క చాలానే క‌థ ఉంది.

ఇక‌పోతే .. అస‌లు ఇటీవ‌లి కాలంలో జేడీ అస్స‌లు టాలీవుడ్‌లో క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే అత‌డు ఇరుగుపొరుగు భాషల్లో న‌టించేందుకు ప్రాధాన్య‌త‌నివ్వ‌డ‌మేన‌ని జేడీ శిష్యుడు ఒక‌రు తెలిపారు. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో ఖ‌రీదైన ఇల్లు-ఆఫీస్ కార్యాల‌యం ఉన్నా జేడీ ఎక్కువ‌గా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోనే న‌టిస్తున్నాడు. వీలున్న‌ప్పుడ‌ల్లా అమెరికాలోని త‌న బంధుమిత్రుల ఇళ్ల‌కు వెళుతుంటాడు. ఇక‌పోతే జేడీ ఇటీవ‌లి కాలంలో మ‌ల‌యాళ‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. మొన్న‌టికి మొన్న ఆఫీస‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అత‌గాడు ఈవెంట్ మేనేజ‌ర్ అవ‌తారం ఎత్త‌డం కాస్తంత ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆ ఈవెంట్ మొత్తం ఆర్గ‌నైజ్ చేసిందే జేడీ. అయితే అత‌డిని స్పాట్‌లో ఒక్క‌రు కూడా గుర్తించ‌క‌పోవ‌డం విశేషం. క‌నీసం ఆర్జీవీ, నాగార్జున సైతం జేడీని వేదిక‌పైకి పిల‌వ‌క‌పోవ‌డంతో ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇక‌పోతే .. జేడీ ఎప్పుడూ ఇంతే సింపుల్ గా ఉంటాడు. కావాల్సినంత సంపాదించుకుని, న‌చ్చిన‌ట్టు బ‌తుకుతున్న జేడీ.. వ్య‌వ‌హారికం ఎప్పుడూ ఇంతే!

User Comments