`మా` గొడ‌వ‌ల్లో మ‌రో అంకం మొద‌లైంది

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌లో గొడ‌వ‌లు ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా క‌నిపించ‌డం లేదు. రోజుకో కొత్త వివాదం తెర‌పైకొస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం మా అధ్య‌క్షుడు న‌రేష్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవిత రాజ‌శేఖ‌ర్‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డ‌మే. ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేసుకుంటూ వెళ్లాల్సి ఉండ‌గా, వాళ్ల మధ్యే ఒక‌రంటే మ‌రొక‌రికి పొసిగే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. దాంతో మా రెండు వ‌ర్గాలుగా విడిపోయింది. అది పెద్ద‌ల జోక్యం వ‌ర‌కు వెళ్లింది. అయితే మాలో గొడ‌వ‌ల గురించి కార్య‌నిర్వాహ‌క ఉపాధ్య‌క్షుడిగా ఉన్న రాజశేఖ‌ర్ బ‌హిరంగంగా వ్యాఖ్యానించ‌డం, చిరంజీవిపై కూడా ప‌రుషంగా మాట్లాడ‌టంతో క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం జోక్యం చేసుకుంది. దాంతో రాజ‌శేఖ‌ర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే… తాజాగా మా వివాదంలో మ‌రో అంకం మొద‌లైంది. న‌రేష్‌పై కూడా క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి లేఖ రాశార‌ట జీవితా రాజ‌శేఖ‌ర్‌. కార్య‌వ‌ర్గంలోని ప‌లువురు స‌భ్యుల‌తో క‌లిసి ప‌లు ఫిర్యాదుల‌తో ఆమె లేఖ‌ని పంపిన‌ట్టు స‌మాచారం. న‌రేష్ ఒంటెత్తు పోక‌డ‌ల‌తో న‌డుచుకుంటున్నాడ‌ని, కార్య‌వ‌ర్గ స‌భ్యుల్ని అవ‌మానిస్తున్నాడ‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నార‌ట‌. మ‌రి ఈ విష‌యంపై క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తంగా ఈ వివాదానికి ఇప్ప‌ట్లో పుల్‌స్టాప్ ప‌డేలా క‌నిపించ‌డం లేద‌నేది మాత్రం సుస్ప‌ష్టం.