ఎయిర్‌టెల్‌ని నెట్టేసిన‌ జియో

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఒక సంచలనం. డేటా, కాల్స్‌ విషయంలో వినూత్నమైన ఆఫర్లను ప్రకటించిన జియో ఈ రంగంలో అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది. తాజాగా వినియోగదారుల సంఖ్యాపరంగా భారతీ ఎయిర్‌టెల్‌ని దాటేసి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు భారతీయ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) విడుదల చేసిన మే నెల నివేదికలో తేలింది. ట్రాయ్‌ నివేదిక ప్రకారం 387.55 మిలియన్ల వినియోగదారులతో వొడాఫోన్‌-ఐడియా ప్రథమ స్థానంలో నిలవగా, రిలయన్స్‌ జియో (323 మిలియన్లు), ఎయిర్‌టెల్‌ (320.38 మిలియన్లు)వినియోగదారులతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

గత కొంత కాలంగా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా మినిమమ్‌ రీచార్జ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటి నుంచి ఈ నెట్‌వర్క్‌లకు వినియోగదారుల సంఖ్య తగ్గిపోయినట్లు ట్రాయ్‌ నివేదికలో తేలింది. ఈ ఏడాది మే నెలలో ఎయిర్‌టెల్ 15.1 లక్షలు, వొడాఫోన్‌-ఐడియా 57 లక్షల మంది వినియోగదారులను కోల్పోయినట్లు ట్రాయ్‌ నివేదికలో వెల్లడించింది. ఇదిలా ఉండగా మే నెలలో 82 లక్షల మంది కొత్త వినియోగదారులు రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌లో చేరినట్లు ట్రాయ్‌ నివేదిక స్పష్టం చేసింది. రిలయన్స్‌ జియో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన 4జీ ఫీచర్‌ఫోన్‌, జియో ఫోన్‌ లాంటివి కూడా వినియోగదారులు జియోవైపు ఆకర్షితులయ్యేందుకు దోహదపడిందని ట్రాయ్‌ నివేదికలో వెల్లడైంది