ఎనిమిదేళ్ల‌కు జ‌ర్నీ సీక్వెల్ ప్లాన్

జీవిత ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఆ మలుపు ప్రమాదం కావచ్చు, ప్రమోదం కావచ్చు. ఒక జర్నీ ఎలాంటి అనుభవాన్ని మిగిల్చిందో తెలియజేసిన సినిమా జర్నీ. ఈ సినిమా విడుదలై నేటితో 8ఏళ్లు పూర్తయ్యాయి.  నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం ఈ ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ అంశానికి అద్భుతమైన ప్రేమ కథను జోడించి తమిళంలో రూపొందించిన చిత్రం `ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌`ను తెలుగులో ‘జర్నీ’గా నిర్మాత సురేష్ కొండేటి  తెలుగు ప్రేక్షకులకు అందించారు. శర్వానంద్‌, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగులోనూ ఘనవిజయాన్ని సాధించింది. కొత్త దనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఒక ప్రేమ, ఒక ఆర్ద్రత… ఈ సినిమాను ఉన్నత శిఖరాలపై నిలబెట్టింది.

ప్రేక్షకులు జ‌ర్నీ చిత్రాన్ని ఇంతగా ఆదరించడానికి కారణం మన హృదయాంతరాళాలను తట్టిలేపడమే. ప్ర‌యాణంలో యాక్సిడెంట్.. ఎమోష‌న్.. ప్రేమ ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట‌వ్వ‌డ‌మే కాదు.. హృద‌యాన్ని త‌ట్టి లేపాయి. ఇందులో పాత్రధారుల కంటే పాత్రలే కన్పిస్తాయి. ఎవరూ నటించినట్లు ఉండదు. దర్శకుడు స్క్రీన్‌ప్లే చూపించడంలో తగిన శ్రద్ధతీసుకున్నాడు. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే కోపతాపాలు, అనుమానాలు, ప్రవర్తనలు ఇరు జంటల మధ్య బాగా చూపించాడు దర్శకుడు శరవణన్. పతాక సన్నివేశాలు హృదయాన్ని పిండేస్తాయి. ప్రేమకథలు చెబుతూ… అందులోనూ జీవితాన్ని చూపించిన ప్రయత్నమే ఈ జర్నీ. అందుకే అంత పెద్ద విజ‌యం సాధించింది అని నిర్మాత తెలిపారు. ఇక శ‌ర‌వ‌ణ‌న్ జ‌ర్నీ సీక్వెల్ తెర‌కెక్కించ‌నున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. కానీ ఆ ప్ర‌య‌త్నం సాగ‌లేదు. ఇన్నాళ్టికి సీక్వెల్ కి ఆస్కారం ఉంద‌ని తాజాగా ఓ సోర్స్ ద్వారా వెల్ల‌డైంది.