ద‌ర్శ‌కేంద్రుడుకి నో ఆల్ట‌ర్నేట్‌

Last Updated on by

జ‌న్మ ఎత్తినందుకు ఏదో ఒక‌టి సాధించాలంటారు! అలా ఎత్తిన జ‌న్మ‌ను ధ‌న్యం చేసుకునేవాళ్లు ఇల‌లో కొంద‌రే ఉంటారు. ఆ కొంద‌రిలో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఒక‌రు. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల రారాజుగా నాలుగు ద‌శాబ్ధాల పాటు కెరీర్‌ని దిగ్విజ‌యంగా సాగించిన ద‌ర్శ‌కేంద్రుడు.. 43 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 107 చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇంత పెద్ద ట్రాక్ రికార్డ్ వేరొక ద‌ర్శ‌కుడికి అంత తేలిక కానేకాదు. ఇందులో ఎన్నో సెన్సేష‌న‌ల్ హిట్స్‌, క‌మ‌ర్షియ‌ల్ హిట్స్, ఇండ‌స్ట్రీ హిట్స్ ఉన్నాయి.

బొడ్డుపై ప‌ళ్ల గుత్తులు వేసినా.. ఆ అంద‌మైన దేహ‌శిరుల‌కు ఆకులు-అల‌మ‌లు చుట్టినా… అద‌ర తాంబూలాన్ని త‌మ‌ల‌పాకులు సుతారంగా తాకినా.. అలాంటి స్కిల్ కె.రాఘ‌వేంద్ర‌రావుకే చెల్లింది. ఆ త‌ర‌వాత ఆ నైపుణ్యంను ఆయ‌న శిష్యులు ప్ర‌యోగించినా అదేమంత వ‌ర్క‌వుట‌వ్వ‌లేద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన న‌గ్న‌స‌త్యం. ఇండ‌స్ట్రీలో కె.రాఘ‌వేంద్ర‌రావు లాంటి వేరొక క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కుడు పుట్ట‌బోరు. ఆయ‌న శైలి ఇత‌రులకు రావ‌డం అనేది ఉండ‌దు. ఒక‌వేళ అలా చేసినా అది స్ఫూర్తి అవుతుందే త‌ప్ప యూనిక్ కాద‌న్న‌ది తెలిసిందే. అందుకే ద‌ర్శ‌కేంద్రుడికి నో ఆల్ట‌ర్నేట్‌. భ‌క్తి సినిమాలు తీయ‌డంలోనూ ఆయ‌న‌దే అందెవేసిన చేయి. నాగార్జున క‌థానాయ‌కుడిగా నాలుగు భ‌క్తి సినిమాలు తీశారాయ‌న‌. అన్న‌మ‌య్య‌, శ్రీ‌రామ‌దాసు, శిరిడీ సాయి, ఓం న‌మో వెంక‌టేశాయ వంటి భ‌క్తి సినిమాల్ని తెర‌కెక్కించారు. గొప్ప భ‌క్తుడు కాబ‌ట్టి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భ‌క్తి చానెల్ ఛైర్మ‌న్‌గానూ ఆయ‌న భాధ్య‌త‌లు చేప‌ట్ట‌గ‌లిగారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో తేదేపా స‌పోర్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. నేడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మై ఫ‌స్ట్ షో త‌ర‌పున శుభాకాంక్ష‌లు.

User Comments