కాలా రివ్యూ

Last Updated on by

రివ్యూ: కాలా

నటీనటులు: రజినీకాంత్, హ్యూమాఖురేషి, నానా పటేకర్, ఈశ్వరీరావు తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: రంజిత్ పా

నిర్మాత: ధనుష్

కబాలి సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా కూడా వెంటనే మరో అవకాశం ఇచ్చాడు రజినీకాంత్. ఈ సారి కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా చేస్తాడనే అభిమానులు ఆశిస్తున్నారు. మరి రంజిత్ రెండోసారి ఇచ్చిన అవకాశం నిలబెట్టుకున్నాడా..?

కథ:

కాలా(రజినీకాంత్) కింగ్ ఆఫ్ ధారావి. అక్కడ ఆయన్ని అడక్కుండా చీమ కూడా దూరలేదు. అంత కంచుకోటగా ఉన్న ధారావిపై పొలిటికల్ లీడర్ హరిదాదా(నానా పటేకర్) కన్ను పడుతుంది. ఎలాగైనా అక్కడ ఓ మల్టీ కాంప్లెక్స్ కట్టాలనేది హరిదాదా కల. దాన్ని కాలా అడ్డుకుంటాడు. ఆ ప్రాజెక్ట్ కోసం విదేశాల నుంచి జరీనా(హ్యూమఖురేషి) వస్తుంది. ఆమె కాలాకు మాజీ ప్రేమికురాలు. ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చూస్తున్న హరికి ప్రతీ విషయంలో అడ్డుపడుతుంటాడు కాలా. అదే సమయంలో ఆయన భార్య, కొడుకును చంపేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు ధారావిని కాలా నుంచి తీసుకున్నారా లేదా అనేది అసలు కథ..

కథనం:

ఓ సినిమా చూసినపుడు కచ్చితంగా ఇది ఈ దర్శకుడి నుంచే వచ్చింది అని చెప్పే మార్క్ చాలా కొద్దిమందికే ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఆ మార్క్ రంజిత్ సంపాదించుకున్నాడు. కాకపోతే ఈయన కథలు అన్నీ మురికివాడల చుట్టూ.. సామాన్య జనం చుట్టూ.. సమాజంలో అణిచివేయబడిన కులాల చుట్టూనే తిరుగుతుంటాయి. కబాలిలో అప్పుడు చెప్పింది అదే.. ఇప్పుడు మళ్లీ అదే చేసాడు ఈ దర్శకుడు. కాకపోతే ఈ సారి కబాలి కంటే కాస్త బెటర్ గా చెప్పాడంతే. సూపర్ స్టార్ లాంటి హీరోను పెట్టుకుని కూడా స్క్రీన్ ప్లే లోపాలతో కాలాతో కూడా నిరుత్సాహపరిచాడు రంజిత్. కబాలిపై ఉన్న అంచనాలు దృష్టిలో పెట్టుకుని ఈ సారి ఏ సందడి లేకుండా కాలాను తీసుకొచ్చారు. అసలు ఆ సినిమాలో రజినీకాంత్ ఎంట్రీని నెవర్ బిఫోర్ అన్నట్లు చూపించిన ఈ దర్శకుడు.. కాలాలో మాత్రం చాలా సింపుల్ గా కానిచ్చేసాడు.

కథలోకి కూడా నేరుగానే వెళ్లాడు దర్శకుడు. అయితే సీన్స్ మరీ స్లోగా వెళ్లడం.. హ్యూమాతో రజినీ ప్రేమాయణం కూడా కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా నెమ్మదిగా సాగే ఈ స్క్రీన్ ప్లేతో సినిమాలో ఉన్న అసలు కథ పక్కదోవ పడుతుంది. కథలోకి వచ్చినపుడు మళ్లీ ఆసక్తి కలిగి వెంటనే మళ్లీ ఇంకో సీన్ తో పక్కదారికి వెళ్తుంది. ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ కు ముందు వచ్చి ఫ్లైఓవర్ ఫైట్ సీన్.. సెకండాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్.. నానా పటేకర్ తో వచ్చే సీన్స్ అన్నీ అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు. కానీ ఇదే పేస్ సినిమా అంతా కొనసాగలేదు. అదే అసలు మైనస్. క్లైమాక్స్ మళ్లీ దారిన పడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కథలో చాలా వరకు నాయకుడు సినిమాతో పోలికలు కనిపించాయి. ఓవరాల్ గా మరోసారి యావరేజ్ సినిమాతోనే వచ్చాడు రంజిత్.

నటీనటులు:

రజినీకాంత్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏంలేదు. కాలాగా ఆయన రప్ఫాడించాడు. సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించాడు. నాయకుడి పాత్రలో ఆయన కంటే ఎవరు బాగా నటిస్తారు. నానా పటేకర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ఆయన ప్రతీ సీన్ లోనూ తన అద్భుతమైన నటన చూపించాడు. హ్యూమాఖురేషి పర్లేదు. ఆమె పాత్రకు న్యాయం చేసింది. ఇక రజినీ భార్యగా ఈశ్వరీరావు మరీ తమిళ నటి లా అనిపించింది. ఓవర్ యాక్షన్ అనిపించింది ఆమె డైలాగులు. శియాజీషిండే, సంపత్ కుమార్ పర్లేదు.

టెక్నికల్ టీం:

సంతోష్ నారాయణ్ సంగీతం మరోసారి కబాలిని తలపించింది. అవే ట్యూన్స్ రిపీట్ అయినట్లు అనిపించినా.. కొన్ని సీన్లకు మాత్రం చాలా బాగా బ్యాంగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఆయన ఆర్ఆర్ తో సన్నివేశాలు బాగానే హైలైట్ అయ్యాయి. ఎడిటింగ్ కాస్త వీక్. రెండు గంటల 50 నిమిషాల సినిమా కావడంతో మధ్యలో కొన్ని సీన్స్ తీసెయొచ్చేమో అనిపిస్తుంది. తమిళ్ లో ఓకే కానీ తెలుగులో అది వర్కవుట్ అవ్వదు. దర్శకుడిగా రంజిత్ మరోసారి విఫలమయ్యాడు. కథ విషయంలో ఓకే కానీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. అదే మైనస్. ఆయన చెప్పాలనుకున్న కథ మంచిదే అయినా నెమ్మదిగా రాసుకోవడం ప్రతికూలం.

చివరగా:

కాలా.. కబాలి కంటే కాస్త బెటర్ గా..

రేటింగ్: 2.75/5.0

User Comments