కాశీ రివ్యూ

Last Updated on by

రివ్యూ: కాశీ
న‌టీన‌టులు: విజ‌య్ ఆంటోనీ, అంజ‌లి, శిల్పా మంజునాథ్, నాజ‌ర్ త‌దిత‌రులు
క‌థ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కృతుంగ ఉద‌య‌నిధి
నిర్మాత‌: విజ‌య్ ఆంటోనీ

బిచ్చ‌గాడు త‌ర్వాత తెలుగులో విజ‌య్ ఆంటోనీ సినిమా అంటే కాస్తో కూస్తో అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు బాగానే ఉండ‌టంతో ఈయ‌న సినిమాల్లో కొత్త‌ద‌నం ఉంటుంద‌ని ఆస‌క్తి చూపించారు ప్రేక్ష‌కులు. ఇక ఇప్పుడు ఈయ‌న కాశీ అంటూ మ‌రో సినిమాతో వ‌చ్చాడు. మ‌రి ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంది..?

క‌థ‌:
భ‌ర‌త్(విజ‌య్ ఆంటోనీ)అమెరికాలో లీడింగ్ కార్డియాల‌జిస్ట్. రోజూ ఈయ‌న క‌ల‌లో ఓ ఎద్దు పొడిచిన‌ట్లు క‌నిపిస్తుంటుంది. అందులో ఓ పాము కూడా ఉంటుంది. ఆ క‌ల‌తో ఆయ‌న జీవితానికి ఏదో సంబంధం ఉంద‌ని ఇండియాకు అస‌లు నిజం తెలుసుకోడానికి బ‌యల్దేర‌తాడు. ఆ క్ర‌మంలోనే తాను ఇప్పుడు ఉన్న వాళ్లు అస‌లు అమ్మానాన్న‌లు కాద‌ని.. త‌న త‌ల్లిదండ్రులు ఇండియాలోని ఓ చిన్న ఊళ్లో ఉన్నార‌ని తెలుసుకుంటాడు. అసలు వాళ్లు ఎవ‌రు..? ఈయ‌న వాళ్ల నుంచి ఎందుకు విడిపోయాడు అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
బిచ్చ‌గాడు నుంచి విజ‌య్ ఆంటోనీ సినిమాలంటే తెలుగులో కూడా ఆస‌క్తి మొద‌లైంది. దానికి ముందు కూడా డాక్ట‌ర్ స‌లీమ్, న‌కిలీ లాంటి సినిమాలు ప‌ర్లేద‌నిపించ‌డంతో ప్ర‌తీ సినిమా ఏదో కొత్త‌గా ఉంటుంద‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. కానీ అదేంటో కానీ బిచ్చగాడు త‌ర్వాత ఈయ‌న సినిమాల్లో ప్రేక్ష‌కులు కోరుకునే కొత్త‌ద‌నం క‌రువైంది. దాని స్థానంలో సీరియ‌ల్ గా సాగే క‌థ‌లు మొద‌ల‌య్యాయి. ఇప్పుడు కాశీ కూడా అంతే. తన త‌ల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ సాగే ప్రయాణం చేసే కొడుకు క‌థే ఈ కాశీ. ఆ ప్ర‌యాణంలో అర్థం ప‌ర్థం లేని సీన్స్ తో కాల‌క్షేపం చేసాడు ద‌ర్శ‌కుడు. అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌కుండా అడ్డొచ్చిన వాళ్లంద‌ర్నీ క‌థ‌లు చెప్ప‌డం.. అందులోకి హీరో పాత్ర‌ను దూర్చ‌డం.. ఇదే స‌రిపోయింది సినిమా అంతా.

రెండు ముక్క‌ల్లో తేలిపోయే క‌థ‌ను రెండు గంట‌ల పాటు సాగించాడు ద‌ర్శ‌కుడు. చివ‌ర్లో క‌థ చెప్పిన త‌ర్వాత ప్రేక్ష‌కుడు కూడా ఇదే ఫీల్ అవుతాడు. ఏముంది సినిమాలో.. దీనికోసం రెండు గంట‌లెందుకు సాగ‌దీయ‌డం అని..! ఫ‌స్టాఫ్ లో హీరో కాకుండా మ‌రో ప్రెసిడెంట్ ప్రేమ‌క‌థ‌.. సెకండాఫ్ లో ఓ దొంగ క‌థ‌.. రెండూ అస‌లు క‌థ‌కు అస్స‌లు సంబంధం లేని క‌థ‌లే. వాటిని తీసుకొచ్చి మెయిన్ క‌థ‌కు జోడించాడు ద‌ర్శ‌కుడు. అదెందుకో ఆయ‌న‌కే తెలియాలి మ‌రి..! ఇక అస‌లైన క‌థ చివ‌రి 15 నిమిషాల్లో చెప్తాడు. కానీ అప్ప‌టికే అంద‌రికీ ఆ క‌థేంటి అనేది అర్థ‌మైపోతుంది. అప్ప‌టికి చెప్పినా లాభం లేదు. మొత్తానికి విజ‌య్ ఆంటోనీ ఈ సారి మాత్రం పూర్తిగా మోస‌పోయాడు.. క‌థ లేని ఓ క‌థ‌ను ఎంచుకుని ఎటూ కాకుండా పోయాడు.

న‌టీన‌టులు:
విజ‌య్ ఆంటోనీ బాగానే చేసాడు. ఆయ‌న ఎప్పుడూ ఆర్ద్ర‌త‌తో కూడిన పాత్ర‌లే చేస్తుంటాడు. అమ్మ‌కు దూర‌మైన పాత్ర‌లు.. జీవితంలో ఓడిపోయిన పాత్ర‌లు.. ఇలాంటి సింప‌తీ వ‌చ్చే పాత్ర‌లే చేస్తుంటాడు. ఈ సారి కూడా ఇదే చేసాడు. అంజ‌లి ఎందుకు ఉందో ఆమెకే అర్థం కాదు. అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి మాయ‌మైపోతుంటుంది. మ‌రో హీరోయిన్ శిల్పా మంజునాథ్ పాత్ర కూడా అంతే. రెండు ల‌వ్ స్టోరీస్ కోసం ముగ్గురు హీరోయిన్ల‌ను తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. నాజ‌ర్, జ‌య‌ప్ర‌కాశ్ కూడా క‌థ‌లో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చే పాత్ర‌లే.

టెక్నిక‌ల్ టీం:
విజ‌య్ ఆంటోనీ సంగీతం అర‌వ మేళంగా మారిపోయింది. ఒక్క పాట కూడా మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డం క‌ష్ట‌మే. బ్యాగ్రౌండ్ స్కోర్ ప‌ర్లేదు. ఇక సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఊళ్లోనే సినిమా తెర‌కెక్కించారు కాబ‌ట్టి పెద్ద‌గా చూపించ‌డానికి కూడా ఏం లేదు. ఎడిటింగ్ చాలా వీక్. చాలా సీన్లు క‌ట్ చేయొచ్చేమో అనిపించింది. రెండు గంట‌ల 14 నిమిషాల సినిమా కూడా మూడు గంట‌ల సినిమాలా సాగిపోయింది. ద‌ర్శ‌కుడు కృతుంగ ఉద‌య‌నిధి క‌థ ఎక్క‌డో మొద‌లుపెట్టి ఎక్క‌డో ఆపాడు. మ‌ధ్యలో ఇంకొన్ని క‌థ‌లు జోడించాడు. క‌న్ఫ్యూజ‌న్ లేకుండా చెప్పాడు కానీ క‌థ‌కు అక్క‌ర్లేని క‌థ‌ల‌న్నీ చూపించాడు. అదే అస‌లు బాధ‌.

చివ‌ర‌గా:
కాశీకి పోయింది రామాహ‌రి..!

రేటింగ్: 2.25/5.0

User Comments