కాజల్ విజృంభణ మామూలుగా లేదుగా

సినిమా ఇండస్ట్రీలో ఓపిక చాలా ముఖ్యమని చెబుతుంటారు. ఇక్కడ ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. అది చాలా మంది విషయంలో చాలాసార్లు నిజమైంది కూడా. కాస్త అవకాశాలు తగ్గిపోగానే ఇక కెరీర్ అయిపోయిందని తట్టా బుట్టా సర్దుకునేవాళ్లే ఎక్కువ. కానీ కాస్త ఓపికగా ఎదురు చూస్తూ, ప్రయత్నాలు చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతామని కొద్దిమంది నిరూపిస్తుంటారు. కొన్నాళ్ల కిందట కాజల్‌కి అన్నీ పరాభవాలే. చేసిన సినిమాలేవీ ఆడలేదు. కొత్త అవకాశాలు కూడా దగ్గరికి రాలేదు. దాంతో ఇక కాజల్ పనైపోయినట్టే అనీ, కొత్త భామల జోరులో ఆమె వెనకబడిపోయిందని మాట్లాడుకున్నారు. కానీ కాజల్‌కి ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో బాగా తెలుసు. ఆమె అనుభవమే ఆ విషయాన్ని నేర్పించింది. కిందపడిన ప్రతిసారీ అదే రేంజ్లో పైకి లేస్తుంటుందామె.

అందుకే ఈసారి కూడా మునుపటిలాగా ఓపికతో ఎదురు చూసింది. ఊహించని రీతిలో అరుదైన అవకాశాల్ని సొంతం చేసుకుంది. భారతీయుడు2లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. చాలామంది కథానాయికల్ని సంప్రదించాక కాజల్‌కి ఆ అవకాశం అందింది. ఈ మధ్య చిరంజీవి సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది. త్రిష తప్పుకోవడంతో ఆ సినిమా కాజల్‌కి వచ్చింది. ఇక సురేష్ ప్రొడక్షన్స్‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా దక్కింది. హిందీలో జాన్ అబ్రహామ్‌తో కలిసి నటించే అవకాశాన్ని కూడా సొంతం చేసుకుంది. తాజాగా తమిళంలో మరో కీలకమైన అవకాశం ఆమె సొంతమైందని సమాచారం. `తుపాకీ 2` సినిమానే అది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఇదివరకు చేసిన తుపాకీకి సీక్వెల్‌గా ఆ సినిమా తెరకెక్కబోతోందట. తొలి సినిమాలో నటించిన కాజల్‌నే ఇందులో కూడా కథానాయికగా ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. సో అది కూడా కన్ఫమ్ అయ్యిందంటే కాజల్ నక్క తోక తొక్కినట్టే.