కాజోల్ పై వేటు.. కారణం అదే..?

Kajol faces axe  Prasar Bharati board skipping meetings
బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ మధ్య సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వంతో కలిసి బాగానే పనిచేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కొంతమంది స్టార్స్ విషయంలో మాత్రం కొన్ని కారణాల చేత ఈ కార్యక్రమాలు వివాదాలుగా మారుతున్నాయి. ఈ తరహాలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రసార భారతిలో బోర్డు సభ్యురాలిగా పనిచేస్తోన్న స్టార్ హీరోయిన్ కాజోల్ పై వేటు పడే దాకా పరిస్థితి వచ్చింది. అసలు విషయంలోకి వెళితే, గతేడాది ఫిబ్రవరిలో కాజోల్ ను ప్రసార భారతి బోర్డులో పార్ట్ టైమ్ సభ్యురాలిగా నియమించారు.
అప్పుడు ఈ పదవిపై కాజోల్ చాలా సంతోషం వ్యక్తం చేయటంతో పాటు తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావించింది. అయితే, బోర్డు సమావేశాలకు మొదట బాగానే హాజరైన కాజోల్.. ఈ మధ్య తరచుగా డుమ్మా కొడుతూ వచ్చిందట. ముఖ్యంగా గత నాలుగు సమావేశాల్లోనూ కాజోల్ పాల్గొనలేదట. దీంతో ఇప్పుడు కాజోల్ ను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే నిబంధన ప్రకారం.. ప్రసార భారతి చైర్మన్ కు చెప్పకుండా ఏ సభ్యులైనా వరుసగా మూడు సమావేశాలకు హాజరు కాకుంటే వారి సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చని అంటున్నారు. అందుకే ఇప్పుడు కాజోల్ ను ఈ కారణంగా తప్పించాలని చూస్తున్నారట.
అయితే, ఇప్పుడు కాజోల్ తరపు ప్రతినిధి మాత్రం.. వృత్తిపరమైన పనుల వల్లే గత మూడు సమావేశాలకు కాజోల్ హాజరు కాలేకపోయిందని, అలాగే గత ఏడాది కాలంలో కుటుంబ పరమైన వైద్య కారణాలు కూడా కాజల్ రాకపోవడానికి కారణాలు అయ్యాయని, దానికి ఆమె కూడా చాలా బాధపడ్డారని తమ వాదనను వినిపించారు. దీనికి ఇప్పుడు స్పందించిన అధికారులు.. ముందు కాజోల్ కు నోటీసు ఇచ్చి, తర్వాత ఆమె సభ్యత్వ రద్దుపై ఏం చేయాలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు వదిలేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ప్రసార భారతి నడుస్తుండటంతో.. ప్రస్తుతం కాజోల్ మేటర్ అక్కడ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోలతో కూడిన ఒక గొప్ప స్వతంత్ర సంస్థగా వెలుగొందుతున్న ప్రసార భారతిలో కాజోల్ కు ఇకపై స్థానం ఉందో లేదో త్వరలోనే తేలనుందని సమాచారం.

User Comments