రివ్యూ: ఎమ్మెల్యే

Last Updated on by

రివ్యూ: ఎమ్మెల్యే
నటీనటులు: కళ్యాణ్ రామ్, కాజల్, రవికిషన్, పోసాని తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఉపేంద్ర మాధవ్
నిర్మాతలు: భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి

ఎమ్మెల్యే.. టైటిల్ వినగానే ఏదో తెలియని ఆసక్తి కనిపించింది. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమానా కాదా అని ముందు అనుమానం వచ్చినా.. ఆ తర్వాతే ఇది పొలిటికల్ మూవీ అని అర్థమైంది. మరి ఇప్పుడు నిజంగానే ఎమ్మెల్యే ప్రజల మనసు దోచుకున్నాడా..? బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తాడా..?

కథ:
కళ్యాణ్(కళ్యాణ్ రామ్) చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం చూస్తుంటాడు. అదే టైమ్ లో తన చెల్లి(లాస్య)ని ప్రేమించిన వ్యక్తి(వెన్నెల కిషోర్) కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అది కళ్యాణ్ ఇంట్లో వాళ్లకు నచ్చదు. దాంతో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతారు. బెంగళూర్ వెళ్లి అక్కడ జాబ్ చేస్తోన్న కళ్యాణ్ కు ఇందు(కాజల్) పరిచయం అవుతుంది. ప్రతీసారి ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తుంటుంది. ఆ తర్వాత తాను పని చేస్తోన్న కంపెనీ ఛైర్మెన్ కూతురే యిందు అని తెలుస్తుంది. కానీ ఆమెపై ఓసారి కిడ్నాపింగ్ ఎటాక్ జరుగుతుంది. అసలు యిందు ఎవరు..? ప్రేమిస్తోన్న కళ్యాణ్ ని కూడా కాదని ఎందుకు అతన్ని మోసం చేస్తుంది..? అసలు మధ్యలో ఎమ్మెల్యే గాడప్ప(రవికిషన్) ఎందుకొచ్చాడు..? ఎందుకు కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అనేది మిగిలిన కథ.

కథనం:
ఎమ్మెల్యే.. మంచి లక్షణాలున్న అబ్బాయి. ఫస్ట్ సీన్ నుంచే దర్శకుడు హీరోను ప్రొజెక్ట్ చేసిన విధానం ఇలాగే ఉంది. తమ హీరో ఏం చేసినా మంచిగానే చేస్తాడు.. ఆలోచించి చేస్తాడు అనే కారెక్టరైజేషన్ తోనే సినిమా మొదలు పెట్టాడు ఉపేంద్ర మాధవ్. దాంతో హీరో ఏం చేసినా కూడా మంచే చేస్తున్నాడు అని ప్రేక్షకులు కూడా ఫిక్సైపోతారు. ఆ మైండ్ సెట్ చేసిన తర్వాతే అసలు కథ మొదలుపెడతాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో కథలోకి వెళ్లలేదు దర్శకుడు. కాజల్, కళ్యాణ్ రామ్ మధ్య లవ్ సీన్స్.. పోసాని కామెడీ ట్రాక్.. వెన్నెల కిషోర్ ఎంటర్ టైనింగ్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ వీటన్నింటినీతోనే ఫస్టాఫ్ అయిపోతుంది. ఇవ్వాలి కాబట్టి ఓ ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ వేసాడు దర్శకుడు. సెకండాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. అప్పటి వరకు సాదాసీదాగా నడిచిన కథలోకి సడన్ గా రాజకీయాలు వస్తాయి. ఇదే కథలో ఆసక్తి కూడా పెంచేస్తుంది. ఓ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అతన్ని రెచ్చగొట్టి రాజీనామా చేయించి.. తాను ఎమ్మెల్యేగా గెలవడం అనేది కమర్షియల్ పాయింట్. దాన్ని చాలా కన్విన్సింగ్ గా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు ఉపేంద్ర మాధవ్. రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా బాగుంది. క్లైమాక్స్ లో ఎలాగూ ఏం జరుగు తుందో తెలుసు కాబట్టి కథను అలాగే ముగించాడు దర్శకుడు.

నటీనటులు:
కళ్యాణ్ రామ్ చాలా బాగా నటించాడు. ఈయన నటనకు పేరు పెట్టాల్సిన పనేముంది. పటాస్ తర్వాత మరోసారి అదే జోష్ చూపించాడు ఈ హీరో. ఇక స్టైలింగ్ లో.. క్యాస్ట్యూమ్స్ లో.. లుక్స్ విషయంలో చాలా కొత్తగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. కాజల్ ఉన్నంతలో బాగా చేసింది. ఈమె పాత్ర కూడా కథలో కీలకం ఏం కాదు. పాటలకు మాత్రమే ఉన్నట్లుంది. రవికిషన్ విలన్ గా ఓకే. పోసాని ఫస్టాఫ్ లో కామెడీని బాగానే మోసాడు. ఇక వెన్నెల కిషోర్, లాస్య లాంటి వాళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేసారు.

టెక్నికల్ టీం:
మణిశర్మ మరోసారి తన రోటీన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్ఆర్ అయితే మరీ రొటీన్ గా ఉంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కత్తి.. అతనొక్కడే లాంటి సినిమాల్లో ఇచ్చిన ఆర్ఆర్ మళ్లీ కొట్టాడు. ఇక సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రసాద్ మూరెళ్ల ఫారెన్ అందాలను బాగానే చూపించాడు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా పెద్దగా బోర్ సీన్స్ ఏవీ లేవు కానీ పాత కథ కాబట్టి ఆ ఫీలింగ్ వస్తుందంతే. ఇక దర్శకుడిగా ఉపేంద్ర మాధవ్ తొలి సినిమాకు ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేసాడు. డైలాగ్స్ విషయంలో బాగా రాసుకున్నాడు. ఓవరాల్ గా ఎమ్మెల్యే ఓ రొటీన్ కమర్షియల్ ప్రయత్నం.

చివరగా:
ఎమ్మెల్యే.. రొటీన్ అబ్బాయే..

రేటింగ్: 2.75/5

User Comments