ఎమ్మెల్యే సాంగ్స్ రివ్యూ

Last Updated on by

మ‌ణిశ‌ర్మ పాట‌లంటే ఒక‌ప్పుడు ఉన్న ఆస‌క్తి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు ప్రేక్ష‌కుల్లో. కానీ ఇప్ప‌టికీ తాను మెలోడి బ్ర‌హ్మ‌నే అంటున్నాడు ఈ సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఈయ‌న స్వ‌ర‌ప‌రిచిన ఎమ్మెల్యే పాట‌లు విడుద‌ల‌య్యాయి. క‌ళ్యాణ్ రామ్, కాజ‌ల్ జంట‌గా కొత్త ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మార్చ్ 23న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో నాలుగు పాట‌లున్నాయి మొత్తం. ఇప్ప‌టికే రెండు పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు జ్యూక్ బాక్స్ మొత్తం విడుద‌లైంది. మార్చ్ 17న క‌ర్నూల్ లో ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌ప‌నున్నా కూడా రెండ్రోజుల ముందే పాట‌ల్ని విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ పాట‌ల‌కు రెస్పాన్స్ బాగానే వ‌స్తుంది.

గాళ్ ఫ్రెండ్ గాళ్ ఫ్రెండ్ అంటూ సాగే తొలిపాట పూర్తిగా పెప్పీ నెంబ‌ర్ ఇచ్చాడు మ‌ణిశ‌ర్మ‌. ఇందులో కొత్త‌ద‌నం అంటూ ఏం లేదు కానీ కాజ‌ల్ అందాలు అయితే పాట‌కు బోన‌స్. ఇక గ‌తంలో చాలా సినిమాల‌కు ఇచ్చిన‌ట్లే ఫాస్ట్ బీట్ ఇచ్చాడు మ‌ణి. ముఖ్యంగా ఈ పాట‌లో మ‌ణిశ‌ర్మ గ‌త సినిమా పాట‌ల తాలూకు రిపీట్ మ్యూజిక్ వినిపిస్తుంది. కానీ విన‌డానికి మాత్రం బాగానే ఉంది గాళ్ ప్రెండ్. రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ఈ పాట‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి పాడాడు. ఇక అర్మానీ సూటు.. అడిడాస్ సూటు అంటే సాగే రెండో పాట కూడా మ‌ణిశ‌ర్మ పాత పాట‌ల్ని గుర్తు చేసింది. ఒక్క‌మ‌గాడులోని అమ్మో అమ్మాయి పాట‌లోని ట్యూన్స్ ఈ పాట‌లో ఎక్కువ‌గా వినిపించాడు మ‌ణిశ‌ర్మ‌. అప్పుడు బాబాయ్ కు కొట్టిన ట్యూన్స్ ను ఇప్పుడు అబ్బాయికి కూడా ఇచ్చాడు. యాజిన్ న‌జీర్, ర‌మ్య‌బెహ్రా ఈ పాట‌ను ఆల‌పించారు.

యుద్ధం యుద్ధం అంటూ సాగే మూడో పాట బాగుంది. క‌థ‌ను పూర్తిగా చెప్పే పాట ఇది. ఈ పాట‌ను కూడా రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసాడు. గాళ్ ఫ్రెండ్ పాట‌ను పాడిన అనురాగ్ కుల‌క‌ర్ణి ఈ పాట‌ను కూడా పాడాడు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం సాగే ఈ పాట సినిమాలో కీల‌క‌మైన స‌న్నివేశంలో రానుంది. చాలా సినిమాల‌కు థీమ్ సాంగ్స్ ఇచ్చిన మ‌ణిశ‌ర్మ‌. ఎమ్మెల్యేలోని యుద్ధం యుద్ధం పాట‌కు కూడా అలాంటి పాట‌నే ఇచ్చాడు. మ‌ణిశ‌ర్మ అన్నాక ఖచ్చితంగా ఓ మాస్ నెంబ‌ర్ ఉండాల్సిందే. ఎమ్మెల్యేలో అలాంటి పాట హే ఇందు. ఈ పాట ఇప్ప‌టికే మంచి హిట్టైంది. కాస‌ర్ల శ్యామ్ రాసిన ఈ పాట‌ని తాజా సంచల‌నం రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. స‌న్న‌జాజి నినుచూస్తే డైటింగ్ చేస్తాదే అంటూ చ‌మ‌త్కారంగా రాసాడు ఈ పాట‌ను శ్యామ్. ఇలా ఈ చిత్రంలోని నాలుగు పాట‌లు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే మ‌ణిశ‌ర్మ నుంచి మున‌ప‌టి రేంజ్ పాట‌లు మాత్రం కాదు ఇవి. ఇప్ప‌టికైతే గాళ్ ఫ్రెండ్.. హే యిందు పాట‌లు మాత్రం ప‌ర్లేద‌నిపిస్తున్నాయి.

User Comments