విశ్వ‌రూపం 2 సెన్సార్ అయింది.. కానీ..

ఒక్కోసారి అంతే.. ఒక్కో సినిమాకు నార్మ‌ల్ గా తిప్ప‌లు ఉండ‌వు. ఇప్పుడు విశ్వ‌రూపం 2 సినిమాకు కూడా అంతే. ఈ సినిమా పేరులోనే ఏదో ఉంది. లేక‌పోతే ఏంటి.. ఇన్నేళ్లుగా టైటిల్ కు త‌గ్గ‌ట్లుగానే క‌మ‌ల్ కు విశ్వ‌రూపం చూపిస్తూనే ఉంది ఈ చిత్రం. ఈ చిత్ర తొలి భాగం 2013లో వ‌చ్చింది. ఇది వ‌చ్చిన ఆర్నెళ్ల‌కే సీక్వెల్ రావాలి. కానీ ఇప్ప‌టికీ రాలేదు.. ఎప్ప‌డొస్తుందో తెలియ‌దు. కానీ మ‌న‌సు ప‌డి చేసిన సినిమా క‌దా.. అంత ఈజీగా వ‌దులుకోలేడు క‌మల్ హాస‌న్. అందుకే దానికోసం ఆస్తులు అమ్మి మ‌రి విశ్వ‌రూపం 2ను పూర్తి చేసాడు. నిర్మాత ఆస్కార్ ర‌విచంద్ర‌న్ సీన్ లోంచి త‌ప్పుకున్నా కూడా క‌మ‌ల్ హాస‌న్ బాధ్య‌త తీసుకుని పూర్తి చేసాడు సినిమాను.

ఆ మ‌ధ్య ఇండియ‌న్ జెండాతో ఉన్న విశ్వ‌రూపం 2 ఫ‌స్ట్ లుక్ సినిమాపై ఆస‌క్తి పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ కూడా సిద్ధ‌మైంది. కాక‌పోతే త‌మిళ‌నాట స్ట్రైక్ న‌డుస్తుంది కాబ‌ట్టి ఇప్పుడు అది విడుద‌ల చేయ‌డం లేదు. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తైపోయింది. యు బై ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చింది బోర్డ్. స్ట్రైక్ త‌ర్వాత సినిమా విడుద‌ల తేదీపై ఓ క్లారిటీ రానుంది. గ‌తంలో ముర‌ద‌నాయ‌గం, మ‌ర్మ‌యోగి లాంటి సినిమాల్ని మొద‌లుపెట్టి ఆపేసిన క‌మ‌ల్.. విశ్వ‌రూపం 2కి ఆ గ‌తి ప‌ట్ట‌కూడ‌ద‌ని గ‌ట్టిగానే ఫిక్స్ అయ్యాడు. అందుకే కాస్త ఆల‌స్య‌మైనా బాక్సుల్లోంచి ఆ సినిమాను బ‌య‌టికి తీసుకొస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్.