క‌మ‌ల్ విశ్వ‌రూపం చూపించాడు

Last Updated on by

ప్ర‌తీ మనిషికి ఓపిక ఉంటుంది. కానీ దానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంది. అది దాటితే కోపం.. చిరాకు కూడా వ‌స్తుంటాయి. కానీ ఎన్ని వ‌చ్చినా కొన్నింటిపై ప్రేమ కూడా అలాగే ఉంటుంది. క‌మ‌ల్ హాస‌న్ కు విశ్వ‌రూపంపై ఉన్న‌ది ఇదే. త‌న‌ను ఎంత తిప్ప‌లు పెట్టినా.. ఏడిపించినా.. ఆస్తులు అమ్మించినా విశ్వ రూపం అంటే ఎప్ప‌టికీ క‌మ‌ల్ కు అదే మోజు. ఇప్పుడు ఆ ప్రేమ మొత్తం విశ్వ‌రూపం 2 ట్రైల‌ర్ లో క‌నిపించింది. తొలి భాగం 2013లో విడుద‌లైతే.. రెండో భాగం కోసం ఏకంగా ఐదేళ్లు ఆగాడు క‌మ‌ల్. ఆర్థిక ఇబ్బందుల‌కు తోడు షూటింగ్ లో కూడా అనేక స‌మ‌స్య‌లు రావ‌డంతో విశ్వ‌రూపం అలా ఆగిందంతే. ఇప్పుడు ఇన్నాళ్ల‌కు అన్నీ పూర్తి చేసి సినిమాను విడుద‌ల‌కు సిద్ధం చేసాడు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. అయితే క‌థ విష‌యంలో మాత్రం ఏ క్లారిటీ ఇవ్వ‌లేదు క‌మ‌ల్. మ‌ళ్లీ తొలి భాగం చూస్తున్న‌ట్లుగానే అనిపించ‌డం దీనికి మైన‌స్. చాలా షాట్లు విశ్వ‌రూపంలో క‌నిపించిన‌వే. దాంతో రెండో భాగం ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవ‌చ్చు. అయితే తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో కాస్త యాక్ష‌న్ డోస్ పెంచేసాడు లోక‌నాయ‌కుడు. ఈ వ‌య‌సులో తాను కూడా ఎక్క‌డా త‌గ్గలేదు. పైగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఎటు చూసుకున్నా కూడా విశ్వ‌రూపం 2 అద్భుతంగానే ఉంది. అయితే ఐదేళ్ల పాటు బాక్సుల్లో ఉన్న సినిమా ఇప్పుడు బ‌య‌టికి వ‌స్తుండ‌టంతో అంచ‌నాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఇప్పుడే చెప్ప‌లేం. ఆగ‌స్ట్ 10న సినిమా విడుద‌ల కానుంది.

User Comments