ఆర్జీవీ ఈ కులాల కెలుకుడేంది?

నిరంత‌రం ఏదో ఒక వివాదాన్ని రాజేయ‌నిదే ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ‌కు కంటిపై కునుకైనా ప‌ట్ట‌దు. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` అంటూ ఎన్నిక‌ల ముందు ఆర్జీవీ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. చివ‌రికి ఆ సినిమాని ఏపీలో రిలీజ్ చేయ‌లేక ఆప‌సోపాలు ప‌డ్డాడు. రాజ‌కీయ నాయ‌కుల్ని కెలుకుతూ టీవీ చానెళ్ల టీఆర్పీల‌కు ఆర్జీవీ ఆహార‌మ‌య్యారే కానీ ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా క‌లిసొచ్చిందేం లేదు. అయితే ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జ‌గ‌న్ సీఎం అవుతున్నారు అన‌గానే .. అత‌డికి విజ‌య‌వాడ పోలీస్ రెడ్ కార్పెట్ వేస్తార‌ని భావించి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో బెజ‌వాడ పోలీస్ ఎలా స్పందించారో సేమ్ టు సేమ్ జ‌గ‌న్ వ‌చ్చాక కూడా అక్క‌డ పోలీస్ మార‌క‌పోవ‌డంతో ఒక్క‌సారిగా ఆర్జీవీ ఖంగు తిన్నారు. తానొక‌టి త‌లిస్తే పోలీస్ ఇంకొక‌టి త‌లిచారు! అంటూ చాలానే నిరాశ‌ప‌డ్డారు పాపం. దీంతో య‌థావిధిగా మ‌ళ్లీ పోలీస్ పై యుద్ధం ప్రక‌టించాడు వ‌ర్మ‌. ఓవైపు విజ‌య‌వాడ‌లో ప్రెస్ మీట్ కి పోలీస్ అధికారుల నుంచి అనుమ‌తి రాక‌పోయినా అత‌డు మొండిగా ముందుకెళుతూ మ‌రోసారి పెనుదుమారానికి తెర తీశాడు.

సినిమాల ప్ర‌చారం విష‌యానికి వ‌చ్చేప్ప‌టికి ఆర్జీవీలోని మంకీ అస్స‌లు నిదుర‌పోద‌న్న సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి అత‌డిలోని కోతి నిదుర లేచింది. మే 31 న ఏపీలో `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ సంద‌ర్భంగా సామాజిక మాధ్య‌మాల్లో రిలీజ్ తేదీ పోస్ట‌ర్ల‌ను ముద్రించి ప్ర‌చారానికి పెట్టారు. ఇందులో జ‌గ‌న్ సీఎంగా ప్రమాణ స్వీకారం 30వ తేదీ అయితే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ మే 31న అంటూ ప్రొప‌గండా మొద‌లెట్టాడు ఆర్జీవీ. ఇప్ప‌టికే ఏపీ- విజ‌య‌వాడ కేంద్రంగా న‌డుస్తున్న ప‌లు టీవీ చానెళ్ల‌కెక్కి ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తున్నాడు. చంద్ర‌బాబు పోలీస్ కంటే.. వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోని పోలీస్‌ న‌న్ను బెట‌ర్ గా ట్రీట్ చేస్తార‌ని ఆశిస్తున్నా.. న‌మ‌స్కారం!! అంటూ నిన్న ప్రెస్మీట్ పైనా ట్వీట్ చేశారు. మొత్తానికి అప్ప‌టిక‌ప్పుడే మాట మార్చే వ‌ర్మ నైజం ట్విట్ట‌ర్ పోస్టుల్లో క‌నిపిస్తోంది. అలాగే వేరొక ట్వీట్ లో మ‌రో కాక‌లు పుట్టించే విష‌యం చెప్పాడు ఆర్జీవీ. త‌దుప‌రి వెంట‌నే `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` అనే సినిమా తీస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు. ఈ సినిమా మొత్తం షూటింగ్ విజ‌య‌వాడ‌- అమ‌రావ‌తిలో చేస్తాన‌ని.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ టీమ్ మొత్తం ఈ చిత్రానికి ప‌ని చేస్తుంద‌ని తెలిపాడు. సేమ్‌ కాంబినేష‌న్ లో రాకేష్ రెడ్డి నిర్మిస్తార‌ని అన్నారు.

మొత్తానికి వ‌ర్మ కెల‌క‌కూడ‌నివి కెలుకుతున్నారు. పోలీసులు అధికారికంగా అనుమ‌తి ఇవ్వ‌క‌పోయినా మొండిత‌నం చూపించాడు. కులాల పేరుతో సినిమా టైటిలేంటి? అన‌వ‌స‌రంగా కులాల్ని కెల‌క‌డం ఎందుకు? అంటూ విద్యాధికులైన‌ యూత్ ప్ర‌శ్నిస్తున్నారు. కులం పేరుతో సినిమా టైటిల్ ప్ర‌క‌టించి పుండు మీద కారం చ‌ల్లుతున్నారా? సినిమా టైటిల్స్ లో కులాల్ని ప్ర‌స్థావించ‌డం త‌ప్పు అంటూ విశ్లేషిస్తున్నారు. సినిమా పేరుతో కులాల ప్ర‌స్థావ‌న స‌మ‌గ్ర‌తకు చేటు అంటూ యూత్ లో వాడి వేడిగా చ‌ర్చ మొద‌లైంది. ఇంత‌కీ నేటి సాయంత్రం 4 పీఎం ప్రెస్ మీట్ లో మ‌ళ్లీ ఆర్జీవీ ఏం మాట మారుస్తాడో చూడాలి. ఇదంతా కేవ‌లం ఇప్ప‌టికే జ‌నం మ‌ర్చిపోయిన‌ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ని వివాదాల‌తో ప్ర‌చారం చేసుకునే ఎత్తుగ‌డ అని అనుకోవాలేమో?