క‌ణం.. ఓ బిడ్డ ఆవేద‌న‌..

ఆడ‌పిల్ల‌ను క‌డుపులో ఉండ‌గానే చంపేస్తున్నారు. దానికి మెడిక‌ల్ లో అబార్ష‌న్ అనే పేరు పెట్టేసారు. ఇది ఎంత పాపమో తెలిసినా కూడా మ‌ళ్లీమ‌ళ్లీ అదే చేస్తుంటారు. ఇప్పుడు క‌ణం సినిమా కూడా ఇదే స‌మ‌స్య‌ను ఎత్తి చూపిస్తుంది. ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తోన్న క‌ణం సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. చాలా ఆస‌క్తిక‌రంగా సాగింది ఈ ట్రైల‌ర్. సాయిప‌ల్ల‌వి ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. నాగ‌శౌర్య హీరో. ఒక్క సినిమాతో సూప‌ర్ స్టార్ అయిపోయింది సాయిప‌ల్ల‌వి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటే చాలు సినిమాపై హైప్ పెరిగిపోతుంది. ఇదే న‌మ్మ‌కంతో క‌ణం అనే సినిమా వ‌స్తుందిప్పుడు.

2.0 లాంటి భారీ సినిమాలు నిర్మిస్తోన్న‌ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ణం అనే సినిమా వ‌స్తుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం రూపొందుతుంది. ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్క‌నున్న ఈ చిత్ర ట్రైల‌ర్ కూడా అంతే ఎమోష‌నల్ గా క‌నిపిస్తుంది. దాంతో పాటే ఏదో ఇష్యూను కూడా చూపిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. క‌రు పేరుతో త‌మిళ‌నాట విడుద‌లవుతుంది క‌ణం. సాయిప‌ల్ల‌వి హీరోయిన్ కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఇక పెళ్లిచూపులు ప్రియ‌ద‌ర్శి కూడా ఇందులో కీ రోల్ చేస్తున్నాడు. ఇదే పాత్ర‌ను త‌మిళ్ లో ఆర్ జే బాలాజీ చేస్తున్నాడు.