క‌ణం రివ్యూ

Last Updated on by

రివ్యూ: క‌ణం
న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, సాయిప‌ల్ల‌వి, నిల్ గ‌ల్ ర‌వి, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: ఏఎల్ విజ‌య్

క‌ణం.. కొన్ని రోజులుగా తెలుగుతో పాటు త‌మిళ ఇండ‌స్ట్రీలో కూడా బాగానే వినిపించిన పేరు ఇది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ లాంటి పెద్ద సంస్థ‌.. సాయిప‌ల్ల‌వి న‌టించ‌డం.. ఛ‌లో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత నాగ‌శౌర్య నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో క‌ణంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రి ఈ చిత్రం అంచ‌నాలు అందుకుందా..?

క‌థ‌:
తుల‌సి(సాయిపల్ల‌వి).. కృష్ణ‌(నాగ‌శౌర్య‌) క్లాస్ మేట్స్. ఈ ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. దాని ఫ‌లితంగా 19 ఏళ్ల‌కే తుల‌సికి గ‌ర్భం వ‌స్తుంది. కానీ పెళ్లికి ముందు గ‌ర్భం అంటే స‌మాజం ఒప్పుకోదని.. ప‌రువు పోతుంద‌ని అబార్ష‌న్ చేయిస్తారు. ఆ త‌ర్వాత ఐదేళ్లకు ఇద్ద‌రికి పెళ్లి చేస్తారు. కానీ తుల‌సి మాత్రం ఇంకా ఆ పోయిన పాప‌నే తలుచుకుంటూ బాధ ప‌డుతుంటుంది. అదే స‌మ‌యంలో చ‌నిపోయిన దియా(వెరోనికా) ఆత్మ‌గా మ‌ళ్లీ వ‌స్తుంది. త‌న‌ను చంపేసిన వాళ్ల‌పై పగ తీర్చుకుంటుంది. అస‌లు ఈ ఆత్మ నుంచి కృష్ణ‌ను తుల‌సి ఎలా కాపాడుకుంది..? సొంత కూతురే అంద‌ర్నీ ఎందుకు చంపుతుంది అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం:
క‌ణం చూడ్డానికి చాలా చిన్న క‌థ‌.. కానీ చాలా లోతైన క‌థ‌. బ్రూణ‌హ‌త్య‌లు అనేది మ‌హాపాపంగా మ‌న దేశంలో భావిస్తారు. కానీ ఇప్ప‌టికీ అదే చేస్తుంటారు. చాలా మంది చేస్తోన్న తొంద‌ర‌పాటు ప‌నుల వ‌ల్ల లోకం కూడా చూడ‌కుండా ఎన్నో ల‌క్ష‌ల మంది ప్రాణాలు క‌డుపులోనే బ‌లైపోతున్నాయి. ఇదే కాన్సెప్ట్ ను తీసుకుని క‌ణం చేసాడు ఏఎల్ విజ‌య్. తాను అనుకున్న క‌థ‌ను నేరుగా మొద‌లుపెట్టేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఎక్క‌డా టైమ్ వేస్ట్ అనేది లేకుండా సూటిగా క‌థ‌లోకి వెళ్లిపోయాడు. వాళ్లు చేసిన త‌ప్పు చూపించ‌డం.. అబార్ఝ‌న్.. ఐదేళ్ల‌కు పెళ్లి.. ఆ త‌ర్వాత పాప ఆత్మ‌గా మారి ప‌గ తీర్చుకోవ‌డం అన్నీ చ‌క‌చ‌కా జ‌రిపోతాయి. స్క్రీన్ ప్లే ప‌క్కాగా లేక‌పోవ‌డం ఈ చిత్రానికి అతిపెద్ద మైన‌స్. చిన్న సినిమానే కావ‌డంతో అది పెద్ద‌గా క‌నిపించ‌దు.

కేవ‌లం గంట 40 నిమిషాల నిడివితో వ‌చ్చింది క‌ణం. దాంతో ఎక్క‌డా ఆగ‌కుండా.. ఆగాల్సిన ప‌నిలేకుండా వెళ్లిపోయింది సినిమా. అయితే ఎమోష‌న‌ల్ డ్రామా కాస్తా చిన్న‌పిల్ల రివేంజ్ డ్రామాగా మార్చేసాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు స్లోగా సాగిన ఈ చిత్రం.. సెకండాఫ్ లో కాస్త ఆస‌క్తి పుట్టిస్తుంది. తండ్రి అయినా కూడా త‌న‌ను చంపిన పాపానికి అత‌న్ని కూడా చంపాల‌నుకునే ఆత్మ‌.. భ‌ర్త‌ను కూతురు నుంచి కాపాడుకోవాల‌నునే త‌ల్లి.. ఈ రెండు పాయింట్స్ సెకండాఫ్ లో ఆస‌క్తి పుట్టించాయి. చివ‌రికి చిన్న ట్విస్ట్ తో క‌థ‌కు సుఖాంతం ప‌లికాడు ద‌ర్శ‌కుడు. ఓవ‌రాల్ గా ఈ క‌ణంలో ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ లేవు కానీ.. క‌చ్చితంగా ఆలోచింప‌జేసే మంచి విష‌యాలేతే ఉన్నాయి.

న‌టీన‌టులు:
నాగ‌శౌర్య మ‌రోసారి మంచి న‌ట‌న క‌న‌బ‌ర్చాడు. ఛ‌లోలో చ‌లాకీ కుర్రాడిగా క‌నిపించిన ఈ హీరో.. క‌ణంలో బాధ్య‌త గ‌ల యువ‌కుడిగా.. భ‌ర్త‌గా మారాడు. ఇక సాయిప‌ల్లవి న‌ట‌న గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నేం లేదు. ఆమె ఎంత మంచి న‌టో ఇప్ప‌టికే అర్థ‌మైంది. మ‌రోసారి త‌న‌లోని న‌టిని బ‌య‌టికి తీసుకొచ్చింది ప‌ల్ల‌వి. ప్రియ‌ద‌ర్శి ఫ‌స్టాఫ్ లో ఏదో పిచ్చి కారెక్ట‌ర్ అనిపించినా.. సెకండాఫ్ లో కీల‌కంగా మారిపోయాడు. క్లైమాక్స్ ఆయ‌న చేతుల మీదుగానే సాగుతుంది. ఇక బేబీ వెరోనిక పాత్ర కీల‌కం. క‌డుపులోనే చ‌నిపోయిన పిండం.. ఆత్మ‌గా మారి అంద‌ర్నీ చంప‌డం అనేది అప్ప‌ట్లో దేవీపుత్రుడు కాలంలోనే చూసాం. కానీ ఇప్పుడు కాస్త అప్ డేట్ చేసాడు విజ‌య్. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం:
క‌ణంకు బిగ్గెస్ట్ ప్ల‌స్ సంగీతం. శామ్ సిఎస్ అందించిన నేప‌థ్య సంగీతం అదిరిపోయింది. హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ కు ఈ మాత్రం లేక‌పోతే క‌ష్ట‌మే. ఇక నీర‌వ్ షా సినిమాటోగ్ర‌ఫీ అదిరిపోయింది. బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఈ కెమెరామెన్ త‌న మాయాజాలం చూపించాడు. ఎడిటింగ్ బాగుంది. గంట‌న్న‌ర కంటే కాస్త ఎక్కువ‌గా ఉన్న ఈ చిత్రం ఎక్క‌డా పెద్ద‌గా బోర్ అనిపించ‌దు. కానీ రిపీటెడ్ సీన్లు వ‌స్తుంటాయి. క‌థ‌కుడిగా విజ‌య్ స‌క్సెస్ అయ్యాడు కానీ దాన్ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో కాస్త త‌డ‌బ‌డ్డాడేమో అనిపిస్తుంది. తాను తీసుకున్న కాన్సెప్ట్ ను అర్థ‌వంతంగా పూర్తి చేయ‌లేకపోయాడు ఈ ద‌ర్శ‌కుడు. కానీ క‌చ్చితంగా మంచి సినిమా అయితే ఇచ్చాడు.

చివ‌ర‌గా:
ఈ క‌ణం.. ఆలోచింపజేసే మంచి చిత్రం..

రేటింగ్:3/5

User Comments