Last Updated on by
క్వీన్ కంగన ఫైరింగ్ యాటిట్యూడ్ గురించి తెలిసిందే. పురుషాధిక్య ప్రపంచంపై ఫిరంగులు పేల్చడంలో ఘనాపాటి. హృతిక్ రోషన్ అంతటివాడికే ముచ్చెమటలు పట్టించింది. కరణ్ జోహార్, వరుణ్ ధావన్ అంతటి వాళ్లనే నెప్టోయిజం విషయంలో నోళ్లు మూయించింది. అందుకే కంగన గయ్యాలితనంపై చిలువలుపలువలుగా ముచ్చటించుకుంటారు. కంగన మోడ్రన్ సూర్యకాంతం అంటే తప్పేం కాదు!!
`మణికర్ణికః ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` రిలీజ్ (జనవరి 25) సందర్భంగా కంగన మరోసారి ఫిరంగులు పేల్చింది. ఈసారి తన శత్రువర్గంపై మూకుమ్మడిగా దాడి చేసింది. క్వీన్ తరహాలో కత్తి తిప్పింది. తాను ఎవరికీ ఝడవను.. అదరను.. బెదరను అని తనదైన శైలిలో పేర్కొంది. నా ఫెయిల్యూర్ కోసం కొందరు కాపు కాసుకుని కూచుకున్నారని, అది వాళ్లకు ఆత్మ సంతృప్తిని ఇస్తుందని, అయితే తాను ఫెయిలవ్వనని అంది కంగన. 45రోజుల చిత్రీకరణలో పాల్గొంటే అంతకు నాలుగు నెలల ముందునుంచి ప్రిపరేషన్ లో ఉంటానని కంగన ప్రచార కార్యక్రమాల్లో తనకు ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. కొందరు పనిగట్టుకుని తన ఓటమి కోసం ఎదురు చూస్తున్నారని సెటైర్ వేసింది. అలాంటి వాళ్లకు మణికర్ణిక ఒక సమాధానంగా నిలుస్తుందని, ఈ సినిమాకి ఎంతో కీలకమైన సమయంలో దర్శకుడు వైదొలిగితే తనకు కష్టమే అయినా ఆ బాధ్యతల్ని చేపట్టి సవ్యంగా నెరవేర్చానని, చేసే పనిపై ఎంతో శ్రద్ధతో క్రమశిక్షణతో ఉంటానని .. అదే తనకు విజయాన్ని చేకూరుస్తుందని తెలిపింది కంగన. అయితే కంగన ఓటమి కోసం కాపు కాసుకుని కూచున్నదెవరు? అంటూ ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. ఇది క్రిష్ ని ఉద్ధేశించి కంగన చేసిన వ్యాఖ్యనా? అన్నది సస్పెన్స్. మణికర్ణిక చిత్రం తెలుగు వెర్షన్ రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
User Comments