ఖాకీ మూవీ రివ్యూ

రివ్యూ: ఖాకీ
న‌టీన‌టులు: కార్తి, ర‌కుల్, అభిమ‌న్యు సింగ్, స‌త్య‌న్ త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: వినోద్

కార్తి సినిమా అంటే డ‌బ్బింగ్ సినిమా కింద ట్రీట్ చేయ‌డం ఎప్పుడో మానేసారు మ‌న ప్రేక్ష‌కులు. ఇక్క‌డ కూడా కార్తిని తెలుగు హీరో మాదిరే చూస్తారు. ఈ మ‌ధ్యే ఆయ‌న చెలియా సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా.. ఇప్పుడు ఖాకీతో మ‌రోసారి వ‌చ్చాడు. మ‌రి ఈయ‌న ఆశ‌ల్ని ఖాకీ ఎంత వ‌ర‌కు యూజ్ కానుంది..?

క‌థ‌:
1995-2005 మ‌ధ్య‌ తమిళనాడుతో పాటు మ‌రికొన్ని ప్రాంతాల్లో వ‌ర‌స దోపిడి హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. త‌మిళ‌నాడులోనే ఇవి ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయి. దాంతో ఆ కేసుకు సంబందించిన ఫైల్ అప్పుడే డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్న ధీరజ్ (కార్తి) వద్దకు వస్తుంది. ఆ కేసు ఫైల్ చదివి ఆ దోపిడీ హంతకుల్ని పట్టుకోకపోతే ఇంకా ప్రజలు చనిపోతారని నిర్ణయించుకున్న ధీరజ్ ఇన్వెస్టిగేషన్ కు బయలుదేరుతాడు. అలా విచారణ కోసం కొంతమంది టీమ్ తో కలిసి ప్రాణాలకు తెగించి దేశం మొత్తం తిరిగి కీలక ఆధారాలని సేకరిస్తాడు ధీరజ్. ఆ ఆధారాల‌తో పాటు కొంద‌రు ఇచ్చిన వివారాల‌తో ఆ ముఠాలోని స‌భ్యుల‌ను ఒక్కొక్క‌రిగా ప‌ట్టుకుంటారు పోలీసులు. చివ‌రికి ఆ ముఠా అధ్య‌క్షుడు దొరికాడా..? అస‌లు ఆ దోపిడీల వెన‌క ఉన్న‌ది ఎవ‌రు అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
పోలీస్ స్టోరీ అన‌గానే.. రౌడీల‌తో ర‌ప్ఫాడించ‌డం.. విల‌న్లు ఎక్క‌డున్నా చిటిక‌లో క‌నిపెట్టి తోలు తీసేయ‌డం.. డ్యూటీకి అడ్డొస్తే.. పై ఆఫీస‌ర్స్ పై కూడా నోరు పారేసుకోవ‌డం.. ఇవ‌న్నీ ఇప్ప‌టి వ‌ర‌కు చూసాం. కానీ ఖాకీ సినిమా ఇలా ఉండ‌ద‌ని ముందే క్లారిటీ ఇచ్చాడు కార్తి. దానికి త‌గ్గ‌ట్లే ఉంది ఈ చిత్రం. నిజ జీవితంలో పోలీస్ ఎలా ఉంటాడు.. అత‌డికి ఉండే బాధ‌లేంటి అనే దానిపై ఫోక‌స్ చేస్తూనే అత‌డి డ్యూటీని స‌క్ర‌మంగా చేస్తుంటే ఎలా పై ఆఫీస‌ర్స్ నుంచి ప్రెజ‌ర్స్ ఉంటాయ‌నేది కూడా ముందు చూపించిన త‌ర్వాతే క‌థ‌లోకి దిగాడు ద‌ర్శ‌కుడు. ఓ దొంగ‌ల ముఠా వ‌ర‌స‌గా హ‌త్య‌లు చేస్తుంటే పోలీసులు ఏం చేయ‌లేక‌పోతారు. అలాంటి స‌మ‌యంలో వ‌చ్చిన కార్తి.. ఆ కేస్ ను ఎలా తీసుకున్నాడు.. ఎలా ఇన్వెస్టిగేట్ చేసాడ‌నేది క్లియ‌ర్ గా చూపిస్తూ వెళ్ళాడు ద‌ర్శ‌కుడు. హీరో క‌దా అన్నీ ఈజీగా అయిపోతాయేమో అనుకోడానికి లేదు. ఇక్క‌డ కొన్నిసార్లు స‌క్సెస్ అవుతాడు.. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాడు. ఎదురుదెబ్బ‌లు కూడా తింటాడు. ఫ‌స్టాఫ్ లో హీరో డీస్పీ గా ఛార్జ్ తీసుకోవ‌డం.. ఆ త‌ర్వాత ర‌కుల్ తో సీన్స్.. ఆమెతో రొమాన్స్ ఇవ‌న్నీ కాస్త నెమ్మ‌దిగా సాగుతాయి.

దోపిడి కేస్ ఒక్క‌సారి కార్తి చేతుల్లోకి వ‌చ్చిన త‌ర్వాత అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఎక్క‌డా ఆగ‌కుండా చివ‌రివ‌ర‌కు ప‌రుగులు పెట్టించాడు ద‌ర్శ‌కుడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తీ స్టెప్ ఆక‌ట్టుకునేలా ఉంటుంది. ఈ క‌థ‌లో ఓ రియాలిటీ ఉంది.. యదార్థ సంఘ‌ట‌న‌ల‌ను సినిమాగా తెర‌కెక్కించ‌డం అంత సుల‌భం కాదు. కానీ ఒకే ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడు వినోద్ ఈ విష‌యంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. 1995-2005 మ‌ధ్య త‌మిళ‌నాడుతో పాటు దేశంలోని ప‌లు ప్రాంతాల్లో.. జ‌రిగిన దోపిడి ముఠా చేసిన భీభ‌త్స‌మే ఈ చిత్రం. వాళ్ల కోసం దేశ‌మంతా తిర‌గ‌డం.. ఉన్న కొద్దిపాటి ఇన్ఫ‌ర్మేష‌న్ తో వాళ్ల‌ను ప‌ట్టుకోవ‌డం ఇవ‌న్నీ నిజ‌మైన పోలీసుల క‌ష్టాల‌ను క‌ళ్ల‌కు క‌డ‌తాయి. క‌థ‌గా చూస్తే దండుపాళ్యంను గుర్తుకు చేస్తుంది కానీ.. దానికే పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్దాడు ద‌ర్శ‌కుడు వినోద్. సెకండాఫ్ లో అక్క‌డ‌క్క‌డా స్లో అయిన‌ట్లు అనిపించినా.. చివ‌ర్లోకి వ‌చ్చేస‌రికి మ‌ళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఓవ‌రాల్ గా ఈ ఖాకీ బాగానే ఆక‌ట్టుకుంటుంది.

నటీన‌టులు:
కార్తి న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఏ పాత్ర‌లోనైనా ఇట్టే దూరిపోతాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. డీస్పీ ధీరజ్ గా అద‌ర‌గొట్టాడు కార్తి. ర‌కుల్ ఉన్నంత‌లో బాగానే చేసింది. కార్తితో ఆమె కెమిస్ట్రీ బాగుంది. ఈ సీన్స్ బాగానే డిజైన్ చేసాడు ద‌ర్శ‌కుడు. ఇక హీరో ప‌క్క‌న ఫ్రెండ్ పాత్ర కూడా క‌థ‌లో కీల‌క‌మే. సెకండాఫ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మేనేజ‌ర్ న‌ర్రా శీను ఓ కానిస్టేబుల్ పాత్ర‌లో బాగా చేసాడు. అత‌డి పాత్ర అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పూయిస్తుంది. ఇక అభిమ‌న్యు సింగ్ విల‌న్ పాత్ర‌లో మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు.

టెక్నిక‌ల్ టీం:
జిబ్ర‌న్ పాట‌ల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రీ ఇంట‌ర్వెల్ సీన్ లో ఆయ‌న ఇచ్చిన ఆర్ఆర్ సినిమాకు ప్రాణం. పాట‌ల్లో కూడా తొలి వ‌య‌సే.. టింగ టింగ బాగున్నాయి. ఇక సినిమాటోగ్ర‌ఫీ రియ‌లిస్టిక్ గా అనిపించింది. ఎక్కువ‌గా సినిమా హంగులు కాకుండా వాస్త‌వికంగా అనిపించాయి. ఎడిటింగ్ ఇంకాస్త ట‌ఫ్ గా ఉంటే బాగుండేదేమో. చాలా వ‌ర‌కు బాగానే ఉంది కానీ ఫ‌స్టాఫ్ లో ర‌కుల్ తో ఉన్న సీన్లు కొన్ని తీసేయొచ్చేమో అనిపించింది. ఇక ద‌ర్శ‌కుడు వినోద్ త‌న వ‌ర్క్ చాలా బాగా చేసాడు. స‌తురంగ వెట్టై లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో ఎంట్రీ ఇచ్చిన వినోద్.. రెండో సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ క‌థ తీసుకోవ‌డం సాహ‌స‌మే. దాన్ని చాలా వ‌ర‌కు స‌క్సెస్ చేసాడు వినోద్.

చివ‌ర‌గా: ఈ ఖాకీ.. పోలీస్ ప‌వ‌ర్ బాగానే చూపించాడు..

రేటింగ్:3/5