బ‌స్తీ బాల్రాజు వ‌చ్చేశాడు

Karthikeya turned as basthi balaraju

కార్తికేయ ట్రెండీ క‌థ‌లే ఎక్కువ‌గా చేశాడు. తొలి చిత్రం `ఆర్.ఎక్స్‌.100`తోనే ఆయ‌నపై ఓ ముద్ర ప‌డిపోయింది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న క‌థ‌ల్ని ఎంపిక చేసుకుని న‌టిస్తూ వ‌చ్చాడు. ఆమ‌ధ్య విక్ర‌మ్‌కుమార్‌పై న‌మ్మ‌కంతో విల‌న్ అవ‌తార‌మెత్తాడు. అయితే తొలిసారి ఆయ‌న త‌న కెరీర్‌లో ఒక రా క్యారెక్ట‌ర్‌ని చేస్తున్నాడు. క‌థ కూడా రియ‌లిస్టిక్‌గా సాగేదే అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. బ‌స్తీ బాల‌రాజు పాత్ర‌లో న‌టించ‌బోయే ఆ చిత్రం పేరే… `చావు క‌బురు చ‌ల్ల‌గా`.

జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకంపై బ‌న్నీ వాస్ నిర్మిస్తున్నారు. కౌశిక్ అనే యువ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ కాటికాప‌రిగా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. శ‌వాల్ని అంత్య‌క్రియ‌ల కోసం తీసుకెళ్లే వాహ‌నాన్ని న‌డిపే డ్రైవ‌ర్‌గానూ, శ‌వాల‌కి అంత్య‌క్రియల్ని పూర్తి చేయించే కాటికాప‌రిగానూ ఆయ‌న ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు. ఆ క‌థ‌కి, పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగానే బ‌స్తీ బాల్రాజు లుక్ క‌నిపిస్తోంది. రా అవ‌తారంలోని ఆ లుక్ కొద్దిసేప‌టి కింద‌టే విడుద‌లైంది. సినిమా చిత్రీక‌ర‌ణ‌ని ప్రారంభిస్తున్న‌ట్టు సినీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.