లెజెండ్స్ రూప‌క‌ర్త క‌రుణానిధి

Last Updated on by

త‌మిళ సినీరంగంలో లెజెండ్స్ అన‌ద‌గ్గ క‌థానాయ‌కుల‌తో ర‌చ‌యిత ఎం.క‌రుణానిధి ప‌ని చేశారు. ఆయ‌న దాదాపు 40 సినిమాల‌కు స్క్రిప్టులు అందించారు. ది గ్రేట్ ఎంజీఆర్, శివాజీగ‌ణేష‌న్ వంటి క‌థానాయ‌కుల కెరీర్‌కి కీల‌క మ‌లుపునిచ్చిన సినిమాల‌కు క‌థ‌లు అందించింది క‌రుణానిధి. ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్, విజ‌య్ కాంత్‌, క‌మ‌ల్ హాస‌న్, జ‌య‌ల‌లిత వంటి స్టార్ల‌తో ఆయ‌న ప‌నిచేశారు. 1947లో రాజ‌కుమారి అనే చిత్రంతో రచ‌యిత‌గా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించారు.

రాజ‌కుమారి చిత్రంతోనే ఎంజీఆర్ అలియాస్ మ‌రుదూర్ గోపాల‌న్ రామ‌చంద్ర‌న్ తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఆ క్ర‌మంలోనే ఎంజీఆర్‌కి ఎం.క‌రుణానిధికి మ‌ధ్య హీరో- రైట‌ర్ రిలేష‌న్ బ‌ల‌ప‌డింది. ఆ త‌ర్వాత 1948లో ఎంజీఆర్ న‌టించిన‌ అభిమ‌న్యుడు చిత్రానికి క‌రుణానిధి ర‌చ‌యిత‌. ఈ చిత్రంలో ఎంజీఆర్‌ అర్జునుడిగా న‌టించారు. 1952లో ప‌రాశ‌క్తి అనే చిత్రానికి క‌రుణానిధి స్క్రిప్టు అందించారు. ఈ సినిమాలో అప్ప‌టికే తమిళ నాట సంఘంలో పేరుకుపోయిన అవినీతి, రాజ‌కీయ‌ దుష్ఠ శ‌క్తుల్ని ప్ర‌శ్నిస్తూ ప‌లు స‌న్నివేశాల్ని రాశారు. ఈ సినిమాతోనే త‌మిళ సినిమా గ్రేట్ హీరో శివాజీ గ‌ణేష‌న్‌తో క‌రుణానిధి సాన్నిహిత్యం మ‌రింత పెరిగింది. పాణ‌మ్ (1992) చిత్రంతో క‌రుణా సెన్సేష‌న‌ల్ ర‌చ‌యిత అయ్యారు. ఈ సినిమాలో త‌మిళ రాజ‌కీయాల్ని ప్ర‌శ్నిస్తూ క‌రుణానిధి రాసిన డైలాగులు, లిరిక్స్ చ‌ర్చ‌కు తావిచ్చాయి. `తిరుంబిప్పార్` చిత్రంలో జాతీయ కాంగ్రెస్ నాయ‌కుడు, నాటి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూని విమ‌ర్శిస్తూ ఓ డైలాగ్‌లో `ఉమ‌నైజర్‌` అని రాయ‌డంతో పెద్ద గొడ‌వ‌ల‌య్యాయి. `తిరుంబిప్పార్` క‌రుణానిధి ర‌చ‌న‌ల్లో ఒకానొక బెస్ట్ అంటూ శివాజీ గ‌ణేష‌న్ ప్ర‌శంసించారు. పెరియార్ రామ‌స్వామి ఉద్య‌మానికి ఆక‌ర్షితుడై కాల‌క్ర‌మంలో ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం పార్టీలో చేరి రాజ‌కీయాల్ని స్టార్ట్ చేశారు. ఆ త‌ర్వాత కూడా సినిమాల‌కు ప‌ని చేశారు. శివాజీ గ‌ణేష‌న్ మ‌నోహ‌ర (1954) చిత్రానికి ఆయ‌న ర‌చ‌యిత‌. ఎంజీ రామ‌చంద్ర‌న్ రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో న‌టించిన మ‌లైకాల‌న్ చిత్రానికి క‌రుణానిధి స్క్రిప్టును రాశారు. ఎంజీఆర్‌, శివాజీ స‌హా ప‌లువురు స్టార్ల‌ను త‌యారు చేసిన ఘ‌న‌త ఆయ‌న సొంతం చేసుకున్నారు. నేడు ఆయ‌న తిరిగిరాని అనంత లోకాల‌కు ప‌య‌న‌మైన సంద‌ర్భంగా అభిమానులు శోక‌స‌ముద్రంలో మునిగిపోయారు. త‌మిళ, తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లు ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థించాయి.

User Comments