కట్టప్ప కూతురిపై హత్యాయత్నం, బెదిరింపులు

Kattappa Sathyarajs daughter Divya gets death threats

బాహుబలి పుణ్యమా అని కట్టప్ప గా ఫేమస్ అయిపోయిన నటుడు సత్యరాజ్ ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయారు. అయితే, ఈసారి ఆయన ప్రమేయం ఏమీ లేకుండా.. కేవలం తన కుమార్తె దివ్య కారణంగా ఇప్పుడు కట్టప్ప పేరు హైలైట్ గా వినిపిస్తుండటం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే, సినీ నటుడు సత్యరాజ్ అలియాస్ కట్టప్ప కుమార్తె దివ్య ను రీసెంట్ గా కొందరు విదేశీయులు బెదిరించారట. అంతేకాకుండా తమ మాట వినని కారణంగా వాళ్ళు దివ్యపై హత్యాయత్నం కూడా చేసినట్లు తెలుస్తోంది. దీనికి కారణం దివ్య ప్రముఖ న్యూట్రీషనిస్ట్ కావడమే. ఇంతకూ మేటర్ ఏంటంటే, అమెరికాకు చెందిన ఓ ఫార్మాస్యూటికల్ సంస్థ తయారుచేసిన టాబ్లెట్ లో విటమిన్ల ఓవర్ డోస్ ఉన్నట్లు న్యూట్రీషనిస్ట్ దివ్య గుర్తించి, వాటిని రోగులకు సూచించేందుకు తిరస్కరించిందట.
దీంతో దిగొచ్చిన ఆ విదేశీ సంస్థ తరపున కొందరు దివ్యకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారట. అయితే, దివ్య నిరాకరించడంతో వాళ్ళు చంపుతామని బెదిరించినట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తూ దివ్య లేఖ రావడం ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ విషయంపై తాజాగా మాట్లాడిన దివ్య.. కొన్నిరోజుల క్రితం ముగ్గురు నా క్లినిక్ కు వచ్చారని, మల్టీ విటమిన్ కొవ్వు కరిగించే మందుల గురించి ప్రస్తావించారని, ఆ టైమ్ లో శాస్త్రీయ కాలపరిమితి లేకుండా మందులను రాసివ్వనని చెబితే నన్ను బెదిరించారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బెదిరింపులకు దిగిన ఆ కొందరు మీ రాజకీయవేత్తలతో మాకు పరిచయం ఉందని అన్నారని, అందుకే ప్రధానికి లేఖ ద్వారా ఈ మొత్తం విషయంపై ఫిర్యాదు చేశానని దివ్య పేర్కొంది. దీంతో ఇప్పుడు కట్టప్ప కూతురిపై హత్యాయత్నం, బెదిరింపులు అంటూ వార్తలు తెగ హల్ చల్ చేసేస్తున్నాయి.