`టైగ‌ర్` సంచ‌ల‌నాల‌కు వ‌ర్మ‌ రెడీ!

సంచ‌ల‌నాల‌నే త‌న ఇంటి పేరుగా మార్చుకున్న రామ్‌గోపాల్‌వ‌ర్మ తాజాగా మ‌రో తేనె తుట్టెను క‌దుపబోతున్నారు. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`తో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై ర‌చ్చ‌కు తెర‌లేపిన ఆర్జీవీ తెలంగాణ ఉద్య‌మ సార‌థి, గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ జీవిత క‌థ ఆధారంగా సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. `టైగ‌ర్- కేసీఆర్ ది అగ్రెసీవ్ గాంధీ` పేరుతో తాజాగా సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. `ఆడు తెలంగాణ తెస్త‌నంటే అంతా న‌వ్విండ్రు` అనే క్యాప్ష‌న్‌తో బ‌యోపిక్‌ని ఎంత వ్యంగ్యంగా తెర‌కెక్కించ‌బోతున్నాడో వ‌ర్మ చెప్ప‌క‌నే చెప్పేశారు.

ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోని ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసిన వ‌ర్మ తెలంగాణ ప్ర‌జ‌ల‌ని ఆంధ్రావాళ్లు కించ‌ప‌రుస్తూ చుల‌క‌న‌గా చూస్తుండ‌టం భ‌రించ‌లేని కేసీఆర్ ఎలా పార్టీని స్థాపించారు?. ఎలా తెలంగాణ‌ను సాధించారు? ఈ క్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న స‌వాళ్లేంటి? అనే నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు వ‌ర్మ ప్ర‌క‌టించేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఈ (శ‌నివారం) ఉద‌యం 11 గంట‌ల‌కు ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. జ‌బ‌ర్ద‌స్ట్ మ‌హేష్ ని కేసీఆర్ పాత్ర కోసం ఎంచుకుంటున్న‌ట్టు వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఇదే నిజ‌మైతే వ‌ర్మ‌కు ఏపీలో త‌ప్పిన బ‌డితె పూజ తెలంగాణ‌లో జ‌ర‌గ‌డం ఖాయం అని వినిపిస్తోంది. ఇక కేసీఆర్ బ‌యోపిక్‌లో కేటీఆర్‌, క‌ల్వ‌కుంట్ల క‌విత‌, చంద్ర‌బాబు నాయుడు, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌, హ‌రీష్‌రావు, వైఎస్సార్‌, వైఎస్ జ‌గ‌న్‌, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌, కె. రోశ‌య్య‌, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, రామోజీరావు, నారా లోకేష్ ల పాత్ర‌లువుంటాయ‌ట‌. ఆ మేర‌కు ఆర్జీవీ ట్విట్ట‌ర్ లో వివ‌రాలు అందించారు. ప్ర‌క‌టించిన వాటిలో కొన్ని పాత్ర‌లే క‌నిపిస్తున్నాయి కాబ‌ట్టి మిగ‌తా వాళ్ల‌ని ప‌క్క‌న పెట్టిన‌ట్టేనా? ఈ బ‌యోపిక్‌ని తూతూ మంత్రంగా తీస్తున్నారా? అంటూ వేరొక‌ వాద‌న తాజాగా తెర‌పైకొచ్చింది. కేవ‌లం సంచ‌ల‌నం కోస‌మే ఈ చిత్రాన్ని వ‌ర్మ త‌ల‌పెట్టారా? సీ గ్రేడ్ న‌టుల‌తో సినిమాని చుట్టేయాల‌ని అనుకుంటున్నారా? అంటూ ఫిలింన‌గ‌ర్ లో ఒక‌టే మాటా మంతీ సాగుతోంది. ఈ బ‌యోపిక్ పై ఇంత‌వ‌ర‌కూ తెరాస వ‌ర్గాలు మునుముందు ఎలా స్పందించ‌నున్నాయో వేచి చూడాలి.