కేసీఆర్ ఫిలింసిటీ ..తూచ్‌!

Last Updated on by

రామోజీ ఫిలింసిటీని 1000 నాగ‌ళ్ల‌తో దున్నేస్తాన‌ని కేసీఆర్ హుకుం జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం అవ‌త‌రించ‌క‌ముందు వార్నింగ్ అది. అప్ప‌టికి రామోజీతో కేసీఆర్‌కి అస్స‌లు పొత్తు కుద‌ర‌లేదు. ఆ క్ర‌మంలోనే రామోజీపైనా, ఫిలింఇండ‌స్ట్రీపైనా చాలా క‌థే న‌డిపించారు. క‌ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. కేసీఆర్‌ని ప్ర‌జ‌లు సీఎంని చేశారు. ఆ క్ర‌మంలోనే సినిమావాళ్ల‌పై బెదిరింపులు, అదిలింపులు స్టార్ట‌య్యాయి. ఫిలిం యాక్టివిటీస్‌కి కేటాయించిన భూముల్లో క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్సులు క‌ట్టి వాణిజ్య ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకుంటారా? అంటూ ప‌లువురు సినీపెద్ద‌లకు వార్నింగులు అందాయి. నోటీసులు పంపించారు. వీట‌న్నిటినీ మించి రామోజీ ఫిలింసిటీని బ‌ద‌నాం చేసేందుకు ఓ బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక సిద్ధ‌మైంది. అదే తెలంగాణ ఫిలింఇండ‌స్ట్రీ ఏర్పాటు… ఆ క్ర‌మంలోనే రాచ‌కొండ ఫిలింసిటీ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

తెలంగాణ రాష్ట్రం అవ‌త‌రించాక గొప్ప‌గా ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌రించారు. దాదాపు 2000 ఎక‌రాల్లో రామోజీ ఫిలింసిటీకి కూత‌వేటు దూరంలో.. ఈ మెగా తెలంగాణ‌ ఫిలింసిటీ నిర్మాణం మొద‌లెట్టేస్తున్నామ‌ని అన్నారు. ఆ క్ర‌మంలోనే అధికారులు, రాజ‌కీయ‌నేత‌లు, సినిమా పెద్ద‌ల స‌మ‌క్షంలో భూమి కోసం స‌ర్వేలు కూడా సాగాయి. దాదాపు 35000 ఎక‌రాల మేర రాచ‌కొండ ప‌రిధిలో ప్ర‌భుత్వ భూమి ఉంది. ఇందులో అడ‌వులు ఉన్నాయి. పైగా ఔట‌ర్‌రింగ్‌రోడ్‌కి కూత‌వేటు దూరంలోనే ఈ భూమి ఉంది. దాంతో రాచ‌కొండ కొండ‌ల ప్రాంతంలో ఫిలింసిటీ నిర్మిస్తే భూ సేక‌ర‌ణ‌కు ఇబ్బంది ఉండ‌ద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం న‌మ్మి అక్క‌డ ఏర్పాటు చేసేందుకు పావులు క‌దిపింది. అయితే ఏమైందో.. ఇంత‌లోనే ఈనాడులో ప్ర‌త్యేకంగా కేసీఆర్ బాకా వార్త‌లు వ‌చ్చాయి. క‌ట్ చేస్తే తెలంగాణ ఔన్న‌త్యానికి చెందిన .. నైజాం ఫిలింసిటీ ఏర్పాటు గాల్లో క‌లిసిపోయింది. సినీప‌రిశ్ర‌మ విశాఖ‌కు లేదా న‌వ్యాంధ్ర‌కు త‌ర‌లిపోకుండా కేసీఆర్ ప్ర‌భుత్వం కొన్ని చ‌ర్య‌లు చేప‌ట్టింది. సినిమావాళ్ల‌పై దాడులు నిలిపేసింది. దాంతో అంద‌రిలో ఒక‌టే సందేహం. తెలంగాణ మాటున ఆంధ్రుల‌పై దాడులు.. సినిమావాళ్ల‌పై దాడులు కేవ‌లం ఓట్ల కోస‌మేనా? రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకేనా? అంటే అవున‌నే అంతా ఫిక్స‌యిపోయారు. కొత్త ఇండ‌స్ట్రీకి ఒక్క అడుగు ప‌డ‌లేదంటే దాన‌ర్థం ఇదేక‌దా అని మాట్లాడుకుంటున్నారు. అప్ప‌ట్లో ఫిలింమీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఓసారి తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌లసాని .. ఇంకా ప‌రిశీల‌న‌లోనే ఉంద‌ని చెప్పారు. రామోజీ ఫిలింసిటీని ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నేస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ కేసీఆర్ మ‌న‌సు మారిపోయింది స‌రే.. ఆ ప‌ని చేయ‌క‌పోయినా రాచ‌కొండ ఫిలింసిటీ ఎక్క‌డ‌? అని ప్ర‌శ్నిస్తున్నారంతా. ఇంత‌కీ అదెక్క‌డుంద‌బ్బా??

User Comments