వాటాలు కోసం కేసీఆర్, జ‌గ‌న్ స‌మావేశం

తెలంగాణ, ఏపీ మధ్య పెండింగ్​లో ఉన్న వివాదాలన్నింటినీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సెటిల్​ చేసుకోవాలని ఇరు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్​ ఈ నెల 28న ప్రగతిభవన్​లో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాలు, నీటి వాటాల పంపిణీ, తొమ్మిది పదో షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పల పంపిణీ, విద్యుత్​ సంస్థలకు సంబంధించిన బకాయిలు, ఉద్యోగుల విభజన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా విభాగాలకు చెందిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చలకు సంబంధించిన ఎజెండాను రూపొందిస్తున్నారు.

ప్రధానంగా గోదావరి నీటిని కృష్ణాకు తరలించే సాధ్యాసాధ్యాల అధ్యయనంతోపాటు అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. సాగునీటి రంగ నిపుణులతో పాటు రెండు రాష్ట్రాల అధికారులు దాదాపు అరవై మంది ఈ చర్చల్లో పాల్గొననున్నట్టు తెలిసింది. సీఎంల చర్చల్లో భాగంగా వెలువడ్డ నిర్ణయాలు, మీటింగ్​ తీర్మానాలను వేగవంతంగా అమలు చేసేలా తదుపరి కార్యాచరణ కూడా సిద్ధమైంది. ఇక జులై 3న రెండు రాష్ట్రాల సీఎస్​లు గవర్నర్​ సమక్షంలో సమావేశం కానున్నారు. ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో సెటిల్ చేసుకున్న అంశాలపై నివేదికను గవర్నర్​కు నివేదిస్తారు. తర్వాత దానిని కేంద్ర హోంశాఖకు పంపించేలా టైం టేబుల్​ సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.