కిరాక్ కుర్రాళ్లు వ‌చ్చేస్తున్నారు..

కిరిక్ పార్టీ.. క‌న్న‌డనాట గ‌తేడాది సంచ‌ల‌నం సృష్టించిన సినిమా ఇది. అక్క‌డ ఏడాది పాటు ఆడేసింది ఈ చిత్రం. ఇందులో ఏం ఉందో తెలియ‌దు కానీ ఇప్పుడు ఈ పేరు మాత్రం సౌత్ ఇండియా మొత్తాన్ని ఊపేస్తుంది. క‌థ న‌చ్చి.. ఆ కిక్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఇవ్వాల‌ని వ‌చ్చేస్తున్నాడు నిఖిల్. ఈయ‌న హీరోగా కిరిక్ పార్టీని తెలుగులో కిరాక్ పార్టీగా రీమేక్ చేస్తున్నాడు కొత్త ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి. దానికి త‌మ‌వంతు సాయం చేస్తున్నారు చందూమొండేటి.. సుధీర్ వ‌ర్మ‌. ఇప్ప‌టికే ఈ చిత్రానికి డైలాగులు చందూ రాయ‌గా.. స్క్రీన్ ప్లే బాధ్య‌త‌ను సుధీర్ వ‌ర్మ తీసుకున్నాడు.

ఈ ఇద్ద‌రూ స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుల నుంచి ఔట్ పుట్ తీసుకుని త‌న‌కు న‌చ్చినట్లుగా సినిమా తెర‌కెక్కించాడు శ‌ర‌ణ్. ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. పైగా ఇప్పుడు నిఖిల్ కూడా సూప‌ర్ ఫామ్ లో ఉండ‌టంతో సినిమా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం క‌నిపిస్తుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ జ‌న‌వ‌రి 31 సాయంత్రం 6.30 నిమిషాల‌కు విడుద‌ల కానుంద‌ని పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఫిబ్ర‌వ‌రి 9న సినిమా విడుద‌ల కానుంది. అదే రోజు మ‌రో నాలుగు సినిమాల‌తో పోటీప‌డుతూ పార్టీ చేసుకోడానికి వ‌స్తున్నారు ఈ కిరాక్ కుర్రాళ్లు.