కాంగ్రెస్‌కు కొండా దంప‌తులు షాక్!

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ‌మీద దెబ్బ త‌గ‌ల‌బోతోంది. బీజేపీ ఆక‌ర్శ్ కార‌ణంగా గ‌త కొన్ని రోజులుగా విల‌విల లాడుతున్న కాంగ్రెస్‌కు తెలంగాణ‌లో మ‌రో గ‌ట్టి దెబ్బ త‌గ‌ల‌బోతోంది. ముఖ్యంగా గ‌త కొంత కాలంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో తిరుగులేని నేత‌లుగా చెలామ‌ణీ అవుతున్న కాంగ్రెస్ నేత‌లు కొండా సురేఖ‌, కొండా ముర‌ళి త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీకి షాకివ్వ‌బోతున్నారు. కాంగ్రెస్ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి తెరాస‌కు మారిన ఈ జంట ఆ త‌రువాత కేసీఆర్ తో పొస‌గ‌క బ‌య‌టికి వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా సైలెంట్‌గా వుంటున్న కొండా ముర‌ళి, కొండా సురేఖ మ‌ళ్లీ యాక్టీవ్ కావాల‌న్న ఉద్దేశ్యంతో బీజేపీ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.

తెరాస‌లోనూ, ఆ త‌రువాత కాంగ్రెస్‌లోరూ త‌న కూతురు సుస్మితా ప‌టేల్‌కు భూపాల‌ప‌ల్లి టిక్కెట్‌ని ఆశించి భంగ‌ప‌డిన కొండా దంప‌తులు బీజేపీలోకి రావాలంటే త‌మ కూతురు సుష్మిత‌కు భూపాల‌ప‌ల్లి టికెట్ కేటాయిస్తామని హామీ ఇస్తేనే వ‌స్తామ‌ని కండీష‌న్ పెడుతున్నార‌ట‌. 2024లో జ‌రగ‌బోయే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే స్కెచ్ వేస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అయితే టీడీపీ నుంచి బీజేపీలోకి వ‌చ్చిన గండ్ర స‌త్యనారాయ‌ణ వీరికి అడ్డుగా వున్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో తెరాస‌లో వుండ‌గా కొండా దంప‌తులు త‌మ కుటుంబానికి మూడు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాల‌ని కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే కేసీఆర్ చాలా లైట్‌గ‌గా తీసుకోవ‌డంతో ఆగ్ర‌హించిన కొండా దంప‌తులు పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.