సీఎం మహేష్ బాబు సెటైర్లు వేయడంట..!

Koratala Siva opens Maheshs Bharat Ane Nenu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘స్పైడర్’ గా అలరించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ మధ్యే చివరి దశకు వచ్చేయడంతో మహేష్ కూడా కొరటాల శివ డైరెక్షన్లో తన కొత్త సినిమా ‘భరత్ అను నేను’ తో బిజీ అయిపోతున్నాడు. వీరి కాంబోలో శ్రీమంతుడు తర్వాత వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న విషయం అందరికీ తెలుసు. అందులోనూ ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లు పొలిటికల్ డ్రామాగా తెరకెక్కబోతుండటం.. ఇందులో మహేష్ యువ రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
అయితే, మహేష్ ఇందులో ఎంత సీఎంగా నటిస్తున్నా.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఎటువంటి సెటైర్లు ఉండవని తెలియడం గమనార్హం. ఇదే విషయాన్ని స్వయంగా డైరెక్టర్ కొరటాల శివే తాజాగా ఖరారు చేయడం విశేషం. ఇదిలా ఉంటే, గతంలో ‘లీడర్’ సినిమాలో ఇలానే రానా సీఎంగా నటించినప్పుడు అప్పటి రాజకీయ పరిస్థితులపై సెటైర్లు వేయడం, తప్పులను ఎత్తుచూపడం లాంటివి సినిమాలో చూపించిన విషయం గుర్తుండే ఉంటుంది. దీంతో ఇప్పుడు అన్ని పొలిటికల్ సినిమాల్లో లానే ‘భరత్ అను నేను’ లో కూడా ప్రశ్నాస్త్రాలు, వ్యంగ్యాస్త్రాలు వంటివి ఉంటాయనుకుంటే పొరపాటు పడినట్లే.
ఈ నేపథ్యంలోనే తాజాగా కొరటాల శివ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నిజంగానే మహేష్ బాబు ఒక ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని, ఒక రాష్ట్రానికి పనిచేసే ఒక యువ ముఖ్యమంత్రి రోల్ లో మెప్పిస్తాడని, అయితే సెటైర్లు లాంటివేమీ ఇందులో ఉండవని స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమాలో కొన్ని కొత్త పాయింట్స్ ను టచ్ చేస్తూ రాజకీయాలూ ముఖ్యమంత్రులూ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పడమే గాని, సమకాలీన రాజకీయాలపై ఎటువంటి సెటైర్లు ప్రశంసలు ఏమీ ఉండవని తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో పొలిటికల్ డ్రామా కంటే ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఈ ‘భరత్ అను నేను’ లో ఎటువంటి వివాదాలకు, సెటైర్లకు దారి తీయకుండా మహేష్ బాబును కేవలం ఓ ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా చూపించడానికే కొరటాల శివ రెడీ అవుతున్నారని అర్థమైపోతుంది.