కంగనా కు బాలయ్య కంటే కొంచెం ఎక్కువే!

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ని అంత తొందరగా ఎవరూ మర్చిపోలేరు. అది వందో చిత్రం అని కాదు గాని, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తో బాలయ్య ఈ వయస్సులో అలాంటి వార్ బేస్డ్ సినిమా చేయడం చూసి అందరూ స్వీట్ షాక్ తిన్నారు. శభాష్ బాలయ్య అంటూ కొనియాడారు. ఇప్పుడు ఆ రేంజ్ లోనే బాలీవుడ్ టాలెంటెడ్ భామ కంగనాతో క్రిష్ ‘మణికర్ణిక’ అంటూ ఝాన్సీ రాణి లక్ష్మీభాయ్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నాడు. ఇక్కడ బాలయ్యతో కంగనా కు పోలిక లేదు గాని, ఓ విషయంలో మాత్రం ఈ రెండు సినిమాలూ ఇప్పుడు ఒకేలా ఉండబోతున్నాయి.

ఆ స్టోరీలోకి వెళితే, శాతకర్ణి తరహాలోనే మణికర్ణిక లో కూడా యుద్దాలు, దానికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ దండిగా ఉండబోతున్నాయట. మొదట శాతకర్ణి కి సూపర్ హిట్ టాక్ వచ్చినా.. అందులో మూడు నాలుగు యుద్దాలు తప్ప పెద్దగా కథేమీ లేదనే విమర్శ వ్యక్తమైన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ టైమ్ లో బాలయ్య – క్రిష్ ల టాలెంట్ తో అది మేటర్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు మణికర్ణిక విషయంలో కూడా అంతకుమించి అనేలా యాక్షన్ సీక్వెన్స్ లను క్రిష్ రెడీ చేయిస్తున్నాడట. దానికోసం ఏకంగా బ్రేవ్ హార్ట్, ది బోర్న్ ఐడెంటిటీ, రెసిడెంట్ ఈవిల్ రెట్రిబ్యూషన్ వంటి చిత్రాలకు స్టంట్స్ అందించిన హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ ను తీసుకొచ్చారంటేనే విషయం ఏ రేంజ్ లో ఉందో అర్థమైపోతుంది.

అంతేకాదండోయ్.. ఇప్పటికే నిక్ పావెల్ ఆధ్వర్యంలో కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీ వంటి వాటిపై కంగనా ఫుల్ గా ట్రైనింగ్ తీసేసుకుందని తెలియడం విశేషం. మరోవైపు, ఈ సినిమా కోసం హైదరాబాద్ నుంచి ఏకంగా 300 మంది ఫైటర్లను ప్రత్యేకంగా ముంబై తీసుకెళ్లి మరీ అక్కడ ఓ రేంజ్ లో ట్రైనింగ్ ఇచ్చి యాక్షన్ సీన్స్ తీస్తున్నారని తెలియడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. ఈ కారణంగానే ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఈ రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటం ఇదే తొలిసారని అంటున్నారు. మరి ఈ లెక్కన చూస్తుంటే, క్రిష్ మన బాలయ్య కంటే కొంచెం ఎక్కువగానే కంగనా చేత యుద్ధాలు చేయిస్తున్నాడని అర్థమైపోతుంది. మరి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో రిలీజ్ రోజున చూడాలి.