రివ్యూ: కృష్ణార్జున యుద్ధం

రివ్యూ: కృష్ణార్జున యుద్ధం

న‌టీన‌టులు:  నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, రుక్స‌ర్ మీర్, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు

క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: మేర్ల‌పాక గాంధీ
 
నిర్మాత‌లు: హ‌రీష్ పెద్ది, సాహు గుర‌పాటి

నాని సినిమా అంటే ఇప్పుడు ఎలా ఉంది అని అడ‌గ‌డం నేరం కిందే లెక్క‌. ఎందుకంటే ఆయ‌న సినిమా వ‌చ్చిందంటే క‌చ్చితంగా హిట్ అనే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో కూడా బ‌ల‌ప‌డిపోయింది. ఇలాంటి స‌మ‌యంలో విడుద‌లైంది కృష్ణార్జున యుద్ధం. మ‌రి ఈ చిత్రం నానికి ట్రిపుల్ హ్యాట్రిక్ ఇచ్చిందా… లేదంటే బ్రేక్ వేసిందా..?
క‌థ‌:
కృష్ణ‌(నాని) చిత్తూరు జిల్లా అక్కుర్తిలో ఉంటాడు. అక్క‌డే పొలం ప‌ని చేసుకుంటూ ఉంటాడు. అర్జున్ (నాని) రాక్ స్టార్. యూర‌ప్ లో రాక్ స్టార్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. అర్జున్ కు అమ్మాయిలంటే పిచ్చి ఉంటుంది.. అదే స‌మ‌యంలో ఊళ్లో క‌నిపించిన ప్ర‌తీ అమ్మాయిని ప్రేమించమ‌ని అడుగుతూ స‌తాయిస్తుంటాడు కృష్ణ‌. ఇలాంటి టైమ్ లో ఇద్ద‌రి జీవితాల్లోకి ఇద్ద‌రు అమ్మాయిలు వ‌స్తారు. తొలి చూపులోనే రియా(రుక్స‌ర్)తో కృష్ణ‌.. సుబ్బ‌ల‌క్ష్మి(అనుప‌మ) తో అర్జున్ ప్రేమ‌లో ప‌డ‌తారు. ఆ త‌ర్వాత ఇద్ద‌ర్నీ ఉమెన్ ట్రాఫికింగ్ లో కిడ్నాప్ చేస్తారు. అప్ప‌ట్నుంచీ కృష్ణార్జునులు త‌మ ప్రేమ కోసం యుద్ధం చేస్తారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అనేది అస‌లు క‌థ‌..!
క‌థ‌నం:
కృష్ణార్జున యుద్ధం అంటే కృష్ణ‌, అర్జున్ మ‌ధ్య జ‌రిగే యుద్ధం అనుకుంటారు. కానీ ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇంకో విష‌యం కోసం పోరాడుతారు. అందుకే దీనికి ఈ టైటిల్ పెట్టాడు మేర్ల‌పాక గాంధీ. తొలి సీన్ నుంచే త‌న మార్క్ స్క్రీన్ ప్లే చూపిస్తూ వ‌చ్చాడు గాంధీ. తొలి రెండు సినిమాల త‌ర‌హాలోనే స్క్రీన్ ప్లేతో మాయ చేయాల‌ని చూసాడు. ఫ‌స్టాఫ్ లో చాలా వ‌ర‌కు కృష్ణ‌, అర్జున్ జీవితాల‌ను పోలుస్తూ రాసుకున్నాడు. ఇక్క‌డ గ్రామంలో మాస్ కృష్ణుడు చేసే ప‌నుల‌తో.. అక్క‌డ యూర‌ప్ లో క్లాస్ అర్జునుడితో క‌నెక్ట్ చేసాడు. అయితే కృష్ణ కారెక్ట‌ర్ పై పెట్టిన శ్ర‌ద్ధ మాత్రం అర్జున్ పై పెట్ట‌లేదు ద‌ర్శ‌కుడు. అందుకే ఈ కారెక్ట‌ర్ వ‌చ్చిన‌పుడు థియేటర్స్ లో న‌వ్వులు పూస్తాయి.. అదే అర్జున్ వ‌చ్చిన‌పుడు తెలియ‌కుండానే స్క్రీన్ డ‌ల్ అయిపోతుంది. అందుకే చాలా తెలివిగా అర్జున్ పాత్ర ఉన్న‌పుడు బ్ర‌హ్మాజీతో కావాల్సినంత కామెడీ చేయించాడు గాంధీ. ఈయ‌న సంగీతం నేర్పించే సీన్స్ అన్నీ చాలా బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఇక ఫ‌స్టాఫ్ లో కృష్ణ చెప్పిన ప్ర‌తీ డైలాగ్.. సీన్ ఆక‌ట్టుకుంటుంది. కానీ అస‌లు క‌థ మొద‌లైన త‌ర్వాత సినిమా చ‌ల్ల‌బ‌డిపోతుంది. క‌థేంటో తెలిసిన త‌ర్వాత పెద్ద‌గా ఆస‌క్తి క‌నిపించ‌దు. అయినా నాని త‌న న‌ట‌న‌తో నిల‌బెట్టాడు ఈ చిత్రాన్ని. సెకండాఫ్ లో క‌థ గాడి త‌ప్ప‌డంతో పెద్ద‌గా కామెడీ కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. కాక‌పోతే  నాని ఉండ‌టం ఈ చిత్రానికి ప్ల‌స్. యావ‌రేజ్ కంటెంట్ ను కూడా త‌న న‌ట‌న‌తో నిల‌బెట్టాడు నాని. ఉమెన్ ట్రాఫికింగ్ నేప‌థ్యంలో రాసుకున్న క‌థ కావ‌డంతో చివ‌ర్లో సోష‌ల్ మెసేజ్ కూడా ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు.
న‌టీన‌టులు:
నాని న‌ట‌న గురించి పెద్ద‌గా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ప్ర‌తీ సినిమాకు మెరుగ‌వుతూనే ఉంటాడు. ఇందులో కూడా కృష్ణగా చిత్తూరు యాస‌లో ఎంత‌గా ఆక‌ట్టుకున్నాడో.. అంతే అర్జున్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. అయితే నానిని ఎందుకో ఆ పాత్ర‌లో చూడ‌టం క‌ష్టం అనిపించింది. త‌న వంతు బాగానే చేసాడు. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పెద్ద‌గా చెప్పుకోడానికి ఏం లేదు. ఆమె కంటే రుక్స‌ర్ మీర్ పాత్ర బాగుంది. ఫ‌స్టాఫ్ లో కృష్ణ‌తో వ‌చ్చే సీన్స్ అన్నీ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. బ్ర‌హ్మాజీ మ‌రోసారి న‌వ్వించాడు, ఆయ‌న పాత్ర‌కు థియేట‌ర్ లో న‌వ్వులు పూయ‌డం ఖాయం. ఇక మిగిలిన వాళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే పాత్ర‌లే.
టెక్నిక‌ల్ టీం:
కృష్ణార్జున యుద్ధంకు మెయిన్ అట్రాక్ష‌న్ హిప్ హాప్ త‌మిళ‌న్ మ్యూజిక్. దారిచూడు సాంగ్ అయితే అరాచ‌క‌మే. దానికి తోడు ఐ వాన్న ఫ్లై.. ఉరిమే మ‌న‌సే పాట‌లు కూడా బాగున్నాయి. ఆర్ఆర్ బాగానే ఇచ్చాడు. కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. యూర‌ప్ అందాలు చాలా బాగున్నాయి. ఇక ఎడిటింగ్ ప‌ర్లేదు. సెకండాఫ్ కాస్త డ‌ల్ అనిపించింది. పాట‌లు కూడా అనుకోకుండా వ‌చ్చాయి. ఇక గాంధీ ద‌ర్శ‌కుడిగా మూడో సారి అంత‌గా స‌క్సెస్ కాలేదు. మొద‌టి రెండు సినిమాల‌కు ఫుల్ కామెడీ ప‌టాస్ ఇచ్చిన మేర్ల‌పాక మూడోసారి మాత్రం అంత ఆక‌ట్టుకోలేదు. కానీ నాని ఉన్నాడు కాబ‌ట్టి కృష్ణార్జునులు ప‌ర్లేద‌నిపిస్తారు.
చివ‌ర‌గా:
కృష్ణార్జున యుద్ధం.. కండీష‌న్స్ అప్లై..
రేటింగ్:2.75/5.0