లేడీ క్రికెటర్ ఎమోష‌నల్ జ‌ర్నీ

Last Updated on by

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం కౌసల్య కృష్ణమూర్తి..క్రికెటర్‌. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. మార్చి 13న రాజమండ్రి – బొమ్మూరు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నివాస గృహంలో ప్రారంభమైంది. హీరో కార్తీక్‌రాజు, హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ఎం.పి. మురళీమోహన్‌ క్లాప్‌నివ్వగా, తూ.గో జిల్లా పంపిణీదారుడు, ఎగ్జిబిటర్‌ సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఇదే రోజు నుంచి రాజమండ్రి పరిసరాల్లో కంటిన్యూగా షూటింగ్‌ జరుగుతుంది.

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ -సూపర్‌గుడ్‌, ఎడిటర్‌ మోహన్‌ వంటి బేనర్స్‌లో సినిమాలు చేశాను. అయితే ఎప్పటినుంచో కె.ఎస్‌.రామారావు బేనర్‌లో సినిమా చెయ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరుతోంది. తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ. ఫిమేల్‌ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్‌ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. ఒక మంచి కథతో, పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అన్నారు. నిర్మాత కె.ఎస్‌.రామరావు మాట్లాడుతూ -విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ ఓ నాయిక‌. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఐశ్వర్య ఒక టీజర్‌ చూపించింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. క్రికెటర్‌గా బౌలింగ్‌, బ్యాటింగ్‌ అద్భుతంగా చేసింది. తర్వాత ఆ కథ చెప్పి, ఆ రైట్స్‌ కొనిపించి తెలుగులో నన్నే తియ్యమని చెప్పింది. అలా ఈ సినిమా మొదలవడానికి ఐశ్వర్యా రాజేషే కారణం. తను ఆల్రెడీ తమిళ్‌, మలయాళంలో సినిమాలు చేసినా మ‌హిళా క్రికెటర్‌గా మెయిన్‌ రోల్‌తో తెలుగులో ఎంటర్‌ అవుతోంది. అలాగే మా వైజాగ్‌ రాజుగారి అబ్బాయి కార్తీక్‌ రాజు హీరోగా చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాల్లో మంచి పాత్ర‌లు చేసిన ఆయనకు ఇది మరో గొప్ప క్యారెక్టర్‌ అవుతుంది. వెన్నెల కిషోర్‌ ఎస్‌.ఐ.గా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండే పాత్ర‌లో చేస్తున్నాడు. మా బేనర్‌లో మరో మంచి కథా చిత్రమిది అన్నారు. 6నెల‌లు క్రికెట్ నేర్చుకుని త‌మిళంలో న‌టించాన‌ని .. క్రియేటివ్ నిర్మాత‌తో తెలుగులో తీస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని ఐశ్వ‌ర్యా రాజేష్ అన్నారు.