`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` మూవీ రివ్యూ

Last Updated on by

నటీనటులు: పి.విజ‌య్ కుమార్, య‌జ్ఞ శెట్టి, శ్రీ తేజ్ త‌దిత‌రులు
బ్యానర్: క‌ంపెనీ ప్రొడ‌క్ష‌న్స్ – గ‌న్ షాట్ ఫిలింస్- జీవీ ఫిలింస్
నిర్మాత: రాకేశ్ రెడ్డి- దీప్తి
సంగీతం: క‌ళ్యాణి మాలిక్
దర్శకత్వం: రామ్ గోపాల్ వ‌ర్మ‌- అగ‌స్త్య మంజు
రిలీజ్ తేదీ: 29 మార్చి 2019

ముందు మాట:
ఎన్బీకే తెర‌కెక్కించిన ఎన్టీఆర్ బ‌యోపిక్ (క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు)లో చూపించ‌ని ఎన్నో న‌గ్న స‌త్యాల్ని నేను చూపిస్తానంటూ ఆర్జీవీ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. `ఇదీ అస‌లైన ఎన్టీఆర్ క‌థ‌`అనే ట్యాగ్ లైన్ తోనే వేడి పెంచాడు. ఇది కుటుంబ కుట్ర‌ల చిత్రం అంటూ నంద‌మూరి కుటుంబంలో నారా చంద్ర‌బాబు నాయుడు చిచ్చు గురించి చూపిస్తున్నాన‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించాడు. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన అనంత‌రం న‌మ్మ‌క‌ద్రోహం, చంద్ర‌బాబు వెన్నుపోటు, కుటుంబంలో క‌ల‌త‌లు వంటి వాటిని చూపిస్తున్నాన‌ని, ల‌క్ష్మీ పార్వ‌తి అస‌లు ఎన్టీఆర్ జీవితంలోకి ప్ర‌వేశించాక ఏం జ‌రిగింది? అన్న‌ది య‌థాత‌థంగా చూపిస్తున్నాన‌ని ఆర్జీవీ ముందే క్లియ‌ర్ క‌ట్ గా ప్ర‌క‌టించాడు. దీంతో క‌థేంటో ముందే తెలిసిపోయింది. ఇప్పుడు దానిని ఎలా తీశాడు? అన్న‌దే అస‌లు పాయింట్. ఇదిగో ఈ స‌మీక్ష‌లోకి వెళితే అస‌లు సంగ‌తి అర్థ‌మ‌వుతుంది.

కథనం అనాలిసిస్:
ఆరంభమే ఎన్టీఆర్ ఫోటో కార్డ్స్ పై టైటిల్స్ వేసి ఆస‌క్తి పెంచిన ఆర్జీవీ.. `థాంక్స్ టు బాల‌య్య‌` అంటూ ఆరంభ‌మే న‌వ్వులు పూయించారు. ఇక‌ ఎలాంటి సుత్తి లేకుండా నేరుగా పాయింట్ కి వ‌చ్చేశాడు. ఆర్జీవీ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో సినిమా క‌థాగ‌మ‌నం మొద‌ల‌వుతుంది. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో ఓట‌మి పాలైన క్ర‌మంలో నంద‌మూరి కుటుంబంలో త‌లెత్తిన అంత‌ర్యుద్ధం.. ఆ క్ర‌మంలోనే ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌ను రాస్తాన‌ని ల‌క్ష్మీ పార్వ‌తి పెద్దాయ‌న జీవితంలో ప్ర‌వేశిస్తారు. అటుపై అన్న‌గారు ఎన్టీఆర్ తో క‌లిసి `మేజ‌ర్ చంద్ర‌కాంత్` సినిమాని రూపొందించేందుకు అత‌డి జీవితంలో మోహ‌న్ బాబు పాత్ర ఎలా ప్ర‌వేశించిందో న‌వ్వులు పూయిస్తుంది. చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ‌, పురంధేశ్వ‌రి ఇలా ఒక్కో పాత్ర ల‌క్ష్మీ పార్వ‌తిని చూసి యావ‌గించుకునే స‌న్నివేశాలు ర‌క్తి కట్టిస్తాయి. ఎన్టీఆర్ తో ఆవిడ ఎందుకంత చ‌నువుగా ఉంటుంది? ఆ ఇంట్లోనే ఎందుకు ఇది? అంటూ కుటుంబంలో సంఘ‌ర్ష‌ణ వేడెక్కిస్తుంది. అయినా ల‌క్ష్మీకి ఎన్టీఆర్ ఆక‌ర్షితుల‌వుతారు. త‌న‌కు స‌న్నిహితుడు అవుతాడు. ఆ క్ర‌మంలోనే ల‌క్ష్మీ పార్వ‌తిని పెళ్లాడాల‌ని నిర్ణ‌యించుకున్న ఎన్టీఆర్ త‌నకు ప్రపోజ్ చేస్తారు. అయితే అది గిట్ట‌ని అల్లుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఎన్టీఆర్ కి సీరియ‌స్ వార్నింగ్ ఇస్తారు. ఈ క‌ల‌త‌ల‌తోనే గుండె నొప్పి.. అటుపై మేజ‌ర్ చంద్ర‌కాంత్ స‌క్సెస్ మీట్ లో ల‌క్ష్మీపార్వ‌తిని పెళ్లాడుతాన‌ని ప్ర‌క‌టించ‌డంతో అస‌లు ట్విస్టు మొద‌ల‌వుతుంది. పార్టీ ప‌రంగా ఎన్టీఆర్ `సింహ‌గ‌ర్జ‌న` ప్ర‌జ‌ల్లో వేడెక్కిస్తుంది. 1994 ఎన్నిక‌ల్లో గెలుపొందాక చంద్ర‌బాబు వెన్నెపోటు ప‌థ‌కం.. వైశ్రాయ్ హోట‌ల్ ఎపిసోడ్ తో సినిమా ముగుస్తుంది. వెన్ను పోటు గీతాన్ని ఆర్జీవీ ర‌క్తి క‌ట్టించారు. అయితే ఈ మొత్తం డ్రామాని స్లో నేరేష‌న్ తో న‌త్త న‌డ‌క‌ను చూపించ‌డ‌మే ఆడియెన్ కి అగ్ని ప‌రీక్ష‌.

నటీనటులు:
ఎన్టీఆర్ పాత్ర‌ధారిగా పి.విజ‌య్ కుమార్, ల‌క్ష్మీ పార్వ‌తిగా య‌జ్ఞ శెట్టి, చంద్ర‌బాబుగా శ్రీ తేజ్ అద్భుతంగా అభిన‌యించారు. ఎమోష‌న్ స‌న్నివేశాల్లో అన్న‌గారి ముఖంలో ఎక్స్ ప్రెష‌న్‌ని ప‌లికించ‌డంలో విజ‌య్ కుమార్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఇక ల‌క్ష్మీ పార్వ‌తి జీవితంలో ఎమోష‌న్ ని య‌జ్ఞ శెట్టి అడాప్ట్ చేసుకున్న తీరు ఆస‌క్తిక‌రం. చంద్ర‌బాబు గా శ్రీ‌తేజ్ కుదురుకున్న తీరు.. అభిన‌యించిన తీరు ఇంప్రెస్సివ్. ఇత‌ర పాత్ర‌లు త‌మ ప‌రిధి మేర‌కు ప్ర‌వ‌ర్తించి ఆక‌ట్టుకున్నాయి.

టెక్నికాలిటీస్:
సాంకేతికంగా ఆర్జీవీ మార్క్ తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. కెమెరా, బీజీఎం స‌హా ప్ర‌తిదీ ఓకే. ఎడిటింగ్ మ‌రింత షార్ప్ గా ఉండాల్సింది. సినిమాలో ల్యాగ్ ఇబ్బందిక‌రం. ఒక ద‌ర్శ‌కుడిగా ఆర్జీవీ ఏం చెప్పాడో అది తీయ‌డంలో 200 శాతం స‌ఫ‌ల‌మ‌య్యాడు. ముఖ్యంగా తేదేపా అధినేత చంద్ర‌బాబు నాయుడుపై ఆర్జీవీ ఆల్మోస్ట్ క‌క్ష తీర్చుకున్నాడ‌నే చెప్పాలి. తెదేపా గుండెల్లో మంట పుట్టించ‌డంలో ఆర్జీవీ బిగ్ స‌క్సెస‌య్యాడు. వ‌రుస‌గా కొన్ని ఫ్లాపుల త‌ర్వాత క‌సిగా తీసిన సినిమా ఇద‌ని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్:

* పాత్ర‌ల ఎలివేష‌న్
* క‌థాంశం, ఎత్తుగ‌డ‌
* ఎన్టీఆర్, ల‌క్ష్మీ పార్వ‌తి, చంద్ర‌బాబు పాత్ర‌లు అస్సెట్

మైనస్ పాయింట్స్:

*స్లో నేరేష‌న్ ..
*క‌థ‌నంలో సాగ‌తీత‌, ల్యాగ్

ముగింపు:
ఎన్టీఆర్ అస‌లు క‌థ ఇదే.. ఆర్జీవీ మార్క్ సెన్సేషన్ .. త‌ప్ప‌క చూడొచ్చు..

రేటింగ్: 2.5/ 5

Also Watch : US Box Office Collections

Also Read : Lakshmi’s Ntr Grand USA Premieres Today !!

User Comments