ఎన్టీఆర్‌కు లీకేజీ తంటాలు

Last Updated on by

ఎంత దాచాల‌నుకుంటే అంతా ఓపెన్ అవుతోంది!.. సీక్రెట్ అస్స‌లు దాగ‌ద‌ని ప్రూవ్ అవుతోంది. భారీ సినిమాల విష‌యంలో లీకులు త‌ప్ప‌డం లేదు. శంక‌ర్‌, రాజ‌మౌళి త‌ర‌హాలోనే త‌న సినిమాకి సంబంధించిన ఏ అప్‌డేట్ బ‌య‌ట‌కు లీక్ కాకూడ‌ద‌ని భావించిన త్రివిక్ర‌మ్ `అర‌వింద స‌మేత‌` టీమ్‌ని టైట్ చేశారు. మూవీకి సంబంధించిన ఎలాంటి స‌మాచారం లీక‌వ్వ‌కుండా ఎంతో జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అయితే ఎలా లీక‌వుతున్నాయో ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాన్ని లీక్ చేసే ఫోటోలు ఇప్ప‌టికే ప‌లుమార్లు లీకైపోయాయి. చివ‌రికి ఫోన్లు కూడా సెట్స్‌కి తేవొద్ద‌ని త్రివిక్ర‌ముడు వార్నింగ్ ఇచ్చాడంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ లీకుల బెడ‌ద టీమ్‌ని బెంబేలెత్తిస్తోంది.

అప్ప‌ట్లో నాగ‌బాబు- ఎన్టీఆర్ కాంబినేష‌న్ స‌న్నివేశాలు వెబ్‌లోకి రావ‌డంతో అదో ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఫ్యాక్ష‌న్ సీన్ అని అభిమానులు గెస్ చేశారు. తండ్రిని కాపాడుకునేందుకు కొడుకు ప‌డే తాప‌త్ర‌యం క‌థ ఇదీ అని ముందే లీకులిచ్చేసిన‌ట్ట‌య్యింది. ఇక ఇప్ప‌టికే ఎన్టీఆర్ ఈ చిత్రంలో రాయ‌ల‌సీమ‌కు చెందిన కుర్రాడిగా క‌నిపిస్తాడ‌ని, ఫ్యాక్ష‌న్‌- యాక్ష‌న్ ష‌రా మామూలేన‌ని చెప్పుకున్నారు. అలానే కాలేజ్ విద్యార్థిగా తార‌క్ మెస్మ‌రైజ్ చేస్తాడ‌న్న చ‌ర్చా ఉంది. ఇన్ని లీకులు స‌రిపోవా అన్న‌ట్టు ఎప్పక‌ప్పుడు కొత్త ఫోటోలు లీక‌వుతూ యూనిట్‌లో అంత‌కంత‌కు కంగారు పెంచుతున్నాయి. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే `అర‌వింద స‌మేత` టీజ‌ర్‌ని లాంచ్ చేసేందుకు ప్లాన్‌లో ఉన్నారు. ఈ లోగానే మ‌రోసారి ఆన్‌లొకేష‌న్ ఫోటోలు కొన్ని లీకైపోయాయి. వీటిని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ టీమ్ లీక్ చేసిందా? లేక ఇంకెవ‌రైనానా? అన్న ఆరాలు తీస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ లీకుల బెడ‌ద ఎన్టీఆర్ & టీమ్‌కి కంటిపై కునుకుప‌ట్ట‌నివ్వ‌డం లేదుట‌. ఆ క్ర‌మంలోనే మ‌రింత‌గా జాగ్ర‌త్త‌లు తీసుకునేందుకు యూనిట్ ప్రిపేర‌వుతోంది. ఆగ‌స్టు 15 న టీజ‌ర్ లాంచ్ చేసి, అక్టోబ‌ర్ 12న సినిమా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. జ‌గ‌ప‌తిబాబు, నాగ‌బాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

User Comments