చేతులు కాలాక నింద వేసి ఏం లాభం?

Last Updated on by

సినిమాల జ‌యాప‌జ‌యాలు దైవాదీనం. కొన్నిసార్లు స‌క్సెస్ కి కార‌ణం చెప్ప‌లేం. ఒక్కోసారి ఎందుకు ఫెయిలైందో కూడా త‌ప్పులు వెత‌క‌లేం. మ‌రికొన్ని సార్లు స్వ‌యంకృత‌మే కార‌ణం కావొచ్చు. ఆ మూడో రీజ‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ న‌టించిన `ల‌వ‌ర్స్ డే` ఫెయిల్యూర్ కార‌ణం అని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్. సినిమాపై అన‌వ‌స‌ర‌మైన హైప్ క్రియేట్ చేసి, అటుపై ఆ ఒత్తిడిలో ద‌ర్శ‌కుడు సినిమాని ఎలా తీయాలో మ‌ర్చిపోయాడు. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ కి అనూహ్యంగా వ‌చ్చిన క్రేజును క్యాష్ చేసుకోవాల‌న్న ఆత్రంలో చేయ‌కూడ‌ని త‌ప్పిదాలెన్నో చేశాడు. ఏదో అతిధిగా మెరుస్తుందిలే అనుకుని ప్రియాకి ఓ చిన్న పాత్ర ఇచ్చి.. అటుపై వింక్ సెన్సేష‌న్ గా మారిన ఆ అంద‌గ‌త్తెనే పూర్తి స్థాయి నాయిక‌ను చేసేశాడు. స్క్రిప్టు మార‌డంతోనే ఈ సినిమా క‌థే మారిపోయింది. స్టోరి ఒక అతుకుల బొంత‌లా త‌యారైంది. చివ‌రికి క్లైమాక్స్ ను కూడా స‌రిగా తీయ‌లేక‌పోయాడ‌ని ద‌ర్శ‌కుడిపై విమ‌ర్శ‌లొచ్చాయి.

అయితే ఈ త‌ప్పు త‌న‌ది కాదు! అన్న‌ట్టుగా ఒమ‌ర్ లులు పూర్తిగా డెబ్యూ హీరోయిన్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ పై సీరియ‌స్ అవ్వ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. త‌న‌కు న‌ట‌న రాద‌ని.. చాలా శ్ర‌మించాల్సొచ్చింద‌ని బ‌హిరంగంగా ఒమ‌ర్ లులు వ్యాఖ్యానించ‌డం హాస్యాస్ప‌దం అయ్యింది. ప్రియా త‌న‌కు తానుగా ప్ర‌ధాన నాయిక అవుతాన‌ని క‌ల‌గ‌న‌లేదు. అదంతా చేసింది ఒమ‌ర్ లులు. అయితే ఇప్పుడు సినిమా ఫెయిలైంద‌ని త‌న‌నే బాధ్యురాలిని చేస్తూ నింద‌లు వేస్తుండ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు? అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రియా ప్ర‌కాష్ స్టాట‌స్ తెలిసీ ఎందుకు పూర్తి క‌థానాయిక‌ను చేశాడు? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్న‌. న‌ట‌న రాబ‌ట్టుకోవ‌డం అన్న‌ది ద‌ర్శ‌కుడి చేవ‌కు నిద‌ర్శ‌నం. కానీ ఆ ప‌ని ఒమ‌ర్ లులు స‌మ‌ర్థంగా చేయ‌గ‌లిగాడా? అంటే ఫెయిల‌య్యాడ‌నే అంగీక‌రించాలి.
ఇక డెబ్యూ నాయిక‌గా ఆరంగేట్రం చేసిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ నుంచి ఒక సీనియ‌ర్ న‌టి పెర్ఫామెన్స్ తీసుకోవాల‌నుకుంటే అది క‌రెక్టేనా? అలాగే స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి అయినా డెబ్యూ మూవీ `సూప‌ర్` లో ఏం ఇర‌గ‌దీసేసింద‌ని? ద‌ర్శ‌కుడు పూరి త‌న‌తో అంత గొప్ప‌గా చేయించాడు.. ఆ త‌ర్వాతే న‌ట‌న‌లో ఓన‌మాలు నేర్చుకుంది స్వీటీ. అంచెలంచెలుగా ఎదిగింది. ప్ర‌స్తుతం ప్రియా న‌ట‌శిక్ష‌ణ‌తో రాటుదేలుతోంద‌ట‌. మ‌రోవైపు శ్రీ‌దేవి బంగ్లా అనే బాలీవుడ్ చిత్రంలోనూ న‌టిస్తోంది. నింద‌లు వేసినంత మాత్రాన వింక్ సెన్సేష‌న్ త‌ప్పు చేసిన‌ట్టేనా? కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెబుతుంది. త‌న‌పై నింద‌లు వేసినందుకు ఇన్ స్టాగ్ర‌మ్, ట్విట్ట‌ర్ సాక్షిగా అభిమానులు చాలా సీరియ‌స్ గా ఉన్నారు సుమీ!!